 
													బ్యాంకింగ్ రంగంలో అతిపెద్ద స్కాంగా నిలిచిన ఐసీఐసీఐ బ్యాంక్ స్కాంలో నిందితురాలిగా ఉన్న చందా కొచ్చర్ కొత్త జర్నీని ప్రారంభించారు. ఐసీఐసీఐబ్యాంక్ సీఎండీగా ఉన్నపుడు చందా కొచ్చర్ క్రిడ్‌ప్రోకు పాల్పడ్డారనే ఆరోపణలు సంచలనం రేపాయి. ఈ కేసులో ఉద్యోగం కోల్పోవడంతో పాటు భర్త దీపక్ కొచ్చర్‌తో సహా జైలు శిక్ష అనుభవించారు. ప్రస్తుతం భర్తతో పాటు బెయిల్‌పై ఉన్న చందా కొచ్చర్ సోషల్ మీడియాలో సంచలనం రేపేందుకు సన్నద్ధమయ్యారు. యూట్యూబ్ పాడ్‌కాస్ట్ సిరీస్ 'జర్నీ అన్‌స్క్రిప్టెడ్ విత్ చందా కొచ్చర్' ను లాంచ్ చేశారు. ఎలాంటి పరిణామాన్నైనా ఎందుర్కొనేందుకు ద్ధంగా ఉన్నాననీ, తన పాడ్‌కాస్ట్ చాలా విషయాలను వెలుగులోకి తీసుకొస్తుందని అన్నారు. జెన్ జెడ్ కి ఇష్టమైన మాధ్యమం ద్వారా వెలుగులోకి వస్తున్న చందాకొచ్చర్ పాడ్‌కాస్ట్‌పై కార్పొరేట్ వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది.
'జర్నీ అన్‌స్క్రిప్టెడ్' అనే పాడ్‌కాస్ట్‌ను చందా కొచ్చర్ ప్రారంభించారు. స్వయంగా తాను ఎంతో రీసెర్చ్ చేసి, అతిథులను స్వయంగా ఎంచుకుంటానని ఈ సందర్బంగా ఆమె చెప్పారు. నెలకు మూడు పాడ్‌కాస్ట్‌లు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నానని తెలిపారు. ప్రతిరోజూ కొత్తది నేర్చుకోవడం, మార్పుతోపాటు ముందుకు సాగడం ఈ రెండే తన లక్ష్యాలని ఆమె చెప్పారు.
ఈ షోలో ఆమె తొలి అతిథి మారికో వ్యవస్థాపకుడు, ఛైర్మన్ హర్ష్ మారివాలా. రెండో గెస్ట్‌గా నటుడు రాబోతున్నారని కూడా హింట్ ఇచ్చారు. కానీ ఆ గెస్ట్ పేరును వెల్లడించడానికి నిరాకరించారు. ఈ పాడ్‌కాస్ట్‌ను స్వతంత్ర కంటెంట్, డిజైన్ ఏజెన్సీ ‘ది సాల్ట్ ఇంక్’ రూపొందిస్తోంది. తొలి ఎపిసోడ్ ఇప్పటికే సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా ట్విటర్‌లో దీన్ని షేర్ చేశారు.
కాగా 1984లో ICICI బ్యాంక్‌లో చేరారు చందాకొచ్చర్. 2009లో బ్యాంకు ఎండీ, సీఈవో అయ్యారు. బ్యాంకింగ్ పరిశ్రమలో అత్యంత ప్రసిద్ధి చెందిన మహిళగా గుర్తింపు తెచ్చుకున్నారు. బ్యాంకులు లాభాల పరుగులు పెట్టించి గోల్డెన్ గర్ల్‌గా ప్రశంస లందుకున్నారు. 2010లో ఫోర్బ్స్ 100 మంది అత్యంత శక్తివంతమైన మహిళలలో ఒకరిగా కూడా స్థానం దక్కించుకున్నారు. అంతేకాదు దేశీయ అత్యంత గౌరవనీయమైన ప్రతిష్టాత్మక పద్మ భూషణ్ సహా, ఇంకా అనేక అంతర్జాతీయ అవార్డులను కూడా అందుకున్నారు.
Thoroughly enjoyed this insightful debut podcast by Chanda Kochhar and one of my favorite people @hcmariwala. So many valuable learnings which Harsh has generously shared from his life experiences! Hear the full podcast in https://t.co/Tf2Ax3n8w1 . Some snippets here… pic.twitter.com/dwnkKVeH93
— Harsh Goenka (@hvgoenka) February 16, 2025
2017లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) ప్రాథమిక విచారణ ప్రారంభించినప్పుడు ఈ స్కాం వెలుగులోకి వచ్చింది. వీడియోకాన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్‌కు రూ.3,250 కోట్ల విలువైన రుణాల కేటాయింపు విషయంలో బ్యాంకు సీఎండీ అక్రమాలకు పాల్పడ్డారనేది ప్రధాన ఆరోపణ. 2019లో, వీడియోకాన్ ప్రమోటర్ వేణుగోపాల్ ధూత్‌కు రూ.300 కోట్లు ఇచ్చాన మంజూరు కమిటీలో కొచ్చర్ భాగమని, చివరకు ఆ కంపెనీ దానిని చెల్లించడంలో విఫలమైందని సీబీఐ తన ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది. ఈ కేసులో వేణుగోపాల్ ధూత్, ఆమె భర్త దీపక్ కొచ్చర్ మధ్య జరిగిన క్విడ్ ప్రోకోలో కొచ్చర్ భాగమని సీబీఐ ఆరోపించింది. వీడియోకాన్‌కు రూ.300 కోట్ల రుణం క్లియర్ అయిన ఒక రోజు తర్వాత దీపక్ కొచ్చర్ కంపెనీ నుపవర్ రెన్యూవబుల్స్‌లో వీడియోకాన్ రూ.64 కోట్లు పెట్టుబడి పెట్టిందని సీబీఐ ఆరోపించింది.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
