
వీధివీధినా అనూహ్య ప్రదర్శనల ట్రెండ్ సెట్టర్‌విధి
విధానాలు రూపొందితే.. మరింత ఊపు పర్యాటకానికి మేలు,
స్థానిక కళల వృద్ధికి వీలు సిటీలో ఊపందుకుంటున్న బస్కింగ్ కల్చర్
ఒక ఆహ్లాదకర సాయంత్రం, ట్యాంక్ బండ్ పరిసరాల్లో ఒక వర్ధమాన గాయకుడు ప్రేక్షకులకు వీనుల విందు చేయవచ్చు.. దుర్గం చెరువు తీగల వంతెన సమీపంలో ఒక బీట్‌బాక్సర్ తన ప్రతిభ చూపించవచ్చు.. మరొక ఖాళీ రోడ్డు మీద ఓ సాక్సాఫోన్ ఆర్టిస్ట్ స్వరాలు చిలకరించవచ్చు.. రూ. వందలు, వేలు ఖర్చు పెడితే లేదా ఎంట్రీ ఉంటే కానీ ఆస్వాదించలేని కళా ప్రదర్శనలు బహిరంగ ప్రదేశాల్లో ఉచితంగా అందుబాటులోకి రావడం ఒకప్పుడైతే ఊహాజనితమేమో కానీ.. ఇప్పుడు నగరంలో కళ్ల ముందు కనిపించే వాస్తవం. మెట్రో నగరాల్లో ఇప్పటికే బాగా ఊపుమీదున్న బస్కింగ్ కల్చర్ నగరంలోనూ ఊపందుకుంటోంది. – సాక్షి, సిటీబ్యూరో
బస్కింగ్ అంటే రోడ్డుపై లేదా పబ్లిక్ ప్రదేశంలో ప్రజల కోసం ప్రజల చేత ప్రజల వలన.. అన్నట్టుగా కళలను ప్రదర్శించడం. అది సంగీతం, నృత్యం, ఇంద్రజాలం, పెయింటింగ్ ఇంకా ఏదైనా కావొచ్చు. ఆ ప్రదర్శనను చూసిన వారు ఇష్టపడి డబ్బు(టిప్స్ లేదా డొనేషన్స్) ఇవ్వడం కూడా జరుగుతుంటుంది. వీటినే స్ట్రీట్ పెర్ఫార్మెన్స్ అని కూడా అంటారు.
యూరప్‌లో క్లాప్..
యూరప్‌లో శతాబ్దాల క్రితమే ఈ కల్చర్ ప్రారంభమైంది. ఇండియాలో బస్కింగ్ సంప్రదాయం ఓ రకంగా చాలా పాతది అని చెప్పొచ్చు. వీధి నాటకాలు, జానపద గాయకులు, తోలు బొమ్మలాట బృందాలు, హరిదాసులు. వంటివి భారతీయ బస్కింగ్‌కి చిహ్నాలు అనే చెప్పొచ్చు. ప్రస్తుతం రోడ్ మ్యూజీషియన్స్, లైవ్ పెయింటర్స్, మైమ్ ఆర్టిస్టులు, డ్యాన్సర్స్ బస్కింగ్‌కు బాగా పేరొందారు. ఈ ప్రదర్శనలకు టికెట్ కౌంటర్లు లేదా వేదికలతో సంబంధం లేదు. చాలా సహజంగా, అక్కడికక్కడే మొదలై ముగిసే రెడీమేడ్ ప్రదర్శనలు ఇవి.
బెంగళూరులో జోరుగా
బస్కింగ్ ఒకవైపు కళాకారులకు నేరుగా ప్రేక్షకులతో కలిసే అవకాశం ఇస్తే, మరోవైపు పట్టణ సంస్కృతిలో ఒక ప్రత్యేక వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఈ కల్చర్‌కు ప్రత్యేకంగా పేరొందిన నగరంగా బెంగళూరు నిలుస్తోంది. అక్కడ ఎంజీ రోడ్, చర్చ్ స్ట్రీట్, బ్రిగేడ్ రోడ్ వంటి ప్రదేశాలలో వీధి సంగీతకారులు, బీట్‌బాక్సర్లు, ఫ్లూటిస్టులు తరచూ కనిపిస్తారు. అలాగే ముంబై (బాంద్రా, మెరైన్ డ్రైవ్), ఢిల్లీ(కనాట్ ప్లేస్), గోవా, పుదుచ్చేరి కూడా బస్కింగ్ కల్చర్‌కు బాగా పేరొందాయి. కొన్ని నగరాల్లో బస్కింగ్‌ను షరతులతో అనుమతిస్తున్నారు. అయితే మరికొన్ని చోట్ల ఎటువంటి ముందస్తు అనుమతి లేకుండా పరిమితులకు లోబడి చేసుకోవచ్చు.

నగరంలో బస్కింగ్ ప్రదర్శనకారులు వీధి ప్రదర్శనలు ఇప్పటికీ అరుదే. దీనికి కారణం నగరంలో సాధారణంగా ఏ కార్యక్రమానికైనా ముందస్తు అనుమతి అవసరం. తాము ట్యాంక్ బండ్‌లో ప్రదర్శనకు ప్రయత్నించి విఫలమయ్యామని క్రియేటివ్ హౌజ్ ఎన్‌ఆర్‌బీ వ్యవస్థాపకురాలు శ్రియగుప్తా గుర్తు చేశారు. తమ వాయిద్యాలు కూడా సీజ్ చేశారన్నారామె. ఇది ఇక్కడ మాత్రమే కాదు దేశవ్యాప్తంగానూ ఉన్న సమస్య. ఇటీవల పాండిచ్చేరిలో ఒక ఫ్రెంచ్ బస్కర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ‘లిఖితపూర్వక అనుమతి ఉన్నప్పటికీ, ఏదో ఒక అడ్డంకి వస్తుంటుంది’ అని నగరంలో డ్రాగ్ యాక్ట్స్ చేసే పాత్రుని చిదానంద శాస్త్రి అంటున్నారు. అయితే చాలా మందికి బస్కింగ్ అనే పదం ఇప్పటికీ కొత్తగా అనిపిస్తుంది. దీనిపై ప్రజలు, ప్రభుత్వాల్లో సైతం అవగాహన పెరగాల్సి ఉందనేది కళాకారుల మాట. ‘సెక్యూరిటీ గార్డులకు మేం ఏమి చేస్తున్నామో అర్థం కాలేదు.
అర్థమయ్యేలా చెప్పడానికి పుణ్యకాలం కాస్తా గడచిపోతుంది’ అని శాస్త్రి చెబుతున్నారు. దేశంలో చాలాచోట్ల బస్కింగ్ చట్టబద్ధం కాదు. అలాగని ఇది పూర్తిగా నేరంగా కూడా చూడటం లేదు. ఈ నేపథ్యంలో దీనిని చట్టబద్ధం చేయాలని పలువురు భావిస్తున్నాను. కొన్ని నిబంధనలు, ప్రత్యేక ప్రదేశాలు వీటికి కేటాయిస్తే.. కొన్ని దేశాల్లో మాదిరిగా బస్కర్లకు లైసెన్స్‌లు మంజూరు చేస్తే నగరంలో బస్కింగ్ కల్చర్ స్థానిక కళలను మెరిపిస్తుందని అంటున్నారు.

మన దగ్గరా ఊపు..
విభిన్న రకాల కళలు, కళాకారులు పెరుగుతున్న మన నగరం కూడా బస్కింగ్ ఇటీవలే వేళ్లూనుకుంటోంది. నగరంలోని మారథాన్స్ సందర్భంగా నిర్వహించే మ్యూజికల్ ఈవెంట్స్, అలాగే ఇటీవల నగరవ్యాప్తంగా మెట్రో స్టేషన్స్ లో నిర్వహించిన సంగీతోత్సవాలు బస్కింగ్ ట్రెండ్‌కు అద్దం పడతాయి. ‘ది అర్బన్ నాగా’ పేరిట ప్రదర్శన ఇచ్చే అనంత్ అగర్వాల్, కొంత కాలంగా బహిరంగ ప్రదేశాలలో బీట్‌బాక్సింగ్ చేస్తున్నారు. ‘నా సెట్‌లు ఎక్కువ ఆకస్మికంగా ఉంటాయి వీటికి ప్రజల నుంచి ప్రతిస్పందన బాగుంటోంది.’ అంటూ చెబుతున్నారు. అనుమతులతో సంబంధం లేకుండా నిర్వహించినా, ఎప్పుడూ తాను తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కోలేదని, ఎవరికీ ఇబ్బంది కలిగించనంత కాలం ఇది సమస్యాత్మకం కాదు’ అంటారాయన.