
అక్షరం అంటే ఆమెకు ఆరాధన. పుస్తక పఠనమంటే ప్రీతి. దాంతో అందరూ ఆమెను పుస్తకాల పురుగు అని పిలిచేవారు. పుస్తకాలు చదువుతూనే ఆమె మార్కెటింగ్‌లో ఎం.బి.ఎ. పూర్తి చేసింది. అయితే ఆ చదువును ఆమె కార్పొరేట్ సంస్థలలో లక్షలు సంపాదించి పెట్టే ఉద్యోగం చేయడానికి ఉపయోగించుకోదలచుకోలేదు. సెల్‌ఫోన్లతో... రకరకాల గ్యాడ్జెట్స్‌తో... కంప్యూటర్ గేమ్స్‌తో బిజీ బిజీగా ఉంటున్న నేటి తరంతో కూడా పుస్తకాలను చదివించాలనుకుంది. ముందు తన కూతురు చదవడం కోసం ఆమెను ఆకట్టుకునే పుస్తకాల కోసం వెతుకుతూ, తనకు కావలసిన పుస్తకాలేవీ కనిపించకపోయేసరికి తానే ఒక పుస్తకాలు అమ్మే వ్యాపారాన్ని ఎందుకు ప్రారంభించకూడదు.. అన్న ఆలోచన కలిగింది. అదే బిబ్లియోఫైల్స్ అనే స్టార్టప్‌కు పునాదిగా మారింది. ఆమే ముంబయ్‌కి చెందిన అపూర్వ మాత్రే.
ప్రారంభించిన 6 నెలల్లో 10 వేలకు పైగా కస్టమర్లు 150+ ప్రేరణాత్మక సమీక్షలు వచ్చాయి. ఎందుకంటే బిబ్లియోఫైల్స్ నినాదమే చదవడాన్ని ఒక జీవనశైలిగా మార్చుకోవడం. ఈ ఆలోచనతోనే, అపూర్వ మాత్రే 2020లో పిల్లల పుస్తకాలు అమ్మే స్టార్టప్‌ను స్థాపించింది.
ఒక ఆలోచన నుంచి పుట్టింది
స్టార్టప్ పర్యావరణ వ్యవస్థలో అనుభవజ్ఞురాలైన అపూర్వ మాత్రే, గొప్ప కార్పొరేట్ నేపథ్యం కలిగిన వ్యూహాత్మక సలహాదారు అద్న్యేష్ దళపతిని తన జీవితంలోనే కాదు... వ్యాపారంలో కూడా భాగస్వామిని చేసుకుంది. వారి భాగస్వామ్యం బిబ్లియోఫైల్స్‌కు మూలస్తంభం. విభిన్న నైపుణ్యాలతో కలబోసుకున్న కలలు అద్భుతమైన ఒక ఆలోచనను ఎలా సృష్టించగలవో ఇది రుజువు చేస్తుంది, ‘‘ఒక పుస్తక ప్రియురాలిగా నా బిడ్డకు బాల్యం నుంచే చదవడం పరిచయం చేయాలన్నది నా ఆలోచన. అయితే అది ఒక పనిగా అనిపించకూడదు – దానిని ఆనందదాయకంగా మార్చాలనుకున్నాను. నా కుమార్తె అభిరుచులకు సరిపోయే వయస్సుకు తగిన పుస్తకాలను నేను జాగ్రత్తగా పరిశోధించి ఎంచుకున్నాను. ఫలితంగా, ఆమె పుస్తకంతో ప్రేమలో పడింది. స్క్రీన్ సమయాన్ని తగ్గించేసింది. త్వరలోనే ఆమె తన స్నేహితులు, కుటుంబ సభ్యులకు వయస్సుకు తగిన పుస్తకాలను సిఫార్సు చేయడం, అమ్మడం ప్రారంభించింది. పిల్లలు ఈ పుస్తకాలను ఇష్టపడ్డారు. చదవడం ఒక ఆహ్లాదకరమైన అనుభవంగా మారింది.
పుస్తకాలతోపాటు...
ప్రారంభంలో పుస్తకాలను మాత్రమే అమ్మే ఈ కంపెనీ చాలా దూరం వచ్చింది. ఇప్పుడు విద్యార్థుల కోసం వివిధ రకాల ఉత్పత్తులను అందుబాటు ధరలలో అందిస్తోంది. ఇందులో లంచ్‌బాక్స్‌లు, బాటిళ్లు, అందమైన స్టిక్కర్ ట్యాగ్‌లు ఇలాంటి అనేక ఇతర వస్తువులు ఉన్నాయి. పిల్లల పుస్తకాల విషయానికి వస్తే అనేక ఎంపికలు ఉన్నాయి. అసలు చదవడం ఒక జీవనశైలిగా మార్చుకోవాలంటుంది అపూర్వ. దీనిని సాధించాలంటే... మనం మన పిల్లలకు ప్రినేటల్ దశ నుంచే అంటే గర్భంలో ఉన్నప్పటి నుంచే పుస్తకాలు చదివి వినిపించాలన్నది ఆమె ఆలోచన. ఇందుకోసం ప్రత్యేకమైన వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది; అది కొత్తపుస్తకం మార్కెట్లోకి ప్రవేశించిన క్షణం నుంచి సిఫార్సులు పంచుకునే స్థలం. బిబ్లియోఫైల్స్ అంతిమ లక్ష్యం భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉన్న... సంతోషంగా, బాగా అభివృద్ధి చెందిన పిల్లలను పెంచడం. ఆమె లక్ష్యం నెరవేరాలని ఆశిద్దాం.
సోషల్ మీడియా, అధిక స్క్రీన్ సమయం ఉన్న సమకాలీన కాలంలో బిబ్లియోఫైల్స్ వంటి స్టార్టప్‌లు మనలోని సృజనాత్మక, ఊహాత్మక స్వభావాన్ని గ్రహించడంలో, దానితో కనెక్ట్ అవ్వడంలో కీలక పాత్రపోషిస్తాయి. ఇది ముఖ్యంగా మన ఆత్మను సజీవంగా ఉంచుతుంది. యువ హృదయాలలో ప్రేమ, కరుణ, సానుభూతిని పెంపొందించడం చాలా అవసరం, బిబ్లియోఫైల్స్ విలువలు, సూత్రాల ద్వారా దానిని సాధ్యం చేస్తోంది
అవును... నేనే ఓ బిబ్లియోఫైల్
‘‘నేను బిబ్లియోఫైల్స్‌ను ప్రారంభించినప్పుడు, దానిని ఎలా పెంచుకోవాలో నాకు తెలియదు. నా కుమార్తె జీవితాంతం చదవ గలిగేందుకు సరిపడా పుస్తకాలు కొన్నప్పటికీ, నేను ఖర్చు చేసినంత సంపాదించలేదనే అపరాధ భావనలోకి నాకు తెలియకుండానే వెళ్లి పోయాను. ఈ ఆలోచన నిప్పురవ్వలా నా అభిరుచిని రగిలించింది, అది నా వృత్తిగా మారింది. అవును... బిబ్లియోఫైల్స్ పుట్టింది, ఎందుకంటే నేనే ఓ బిబ్లియోఫైల్ కాబట్టి. అందుకే నేను దీని ద్వారా ఎంత సంపాదించ గలిగాన్న దానికంటే ఏం సాధించానన్నదే నాకు సంతృప్తినిస్తుంది.’’ – అపూర్వ మాత్రే