గంధర్వులను జయించిన భరతుడు | Bharata defeated the Gandharvas | Sakshi
Sakshi News home page

గంధర్వులను జయించిన భరతుడు

Nov 9 2025 5:39 AM | Updated on Nov 9 2025 5:39 AM

Bharata defeated the Gandharvas

రాముడి అశ్వమేధయాగం విజయవంతంగా పూర్తయిన కొన్నాళ్లకు ఒకనాడు కేకయ దేశాధీశుడు యుధాజిత్తు తన గురువు, అంగిరస పుత్రుడైన గార్గ్యుడిని రాముడి వద్దకు పంపాడు. రాముడికి కానుకగా పదివేల జవనాశ్వాలు, ఐదువేల ఏనుగులు, అరుదైన మణిమాణిక్యాలు, చీనీచీనాంబరాలు, అనేక స్వర్ణాభరణాలను పంపాడు. 

మహర్షి అయిన గార్గ్యుడు తన రాజ్యంలోకి అడుగుపెట్టినట్లు తెలుసుకుని రాముడు తన తమ్ములతో కలసి క్రోసు దూరం ఎదురువెళ్లి, గార్గ్యుడికి ఘనస్వాగతం పలికి, ఆయనను పూజించాడు. ఆయనను సగౌరవంగా తన సభామందిరానికి తోడ్కొనిపోయాడు.

గార్గ్యుడిని ఉచితాసనంపై కూర్చుండబెట్టి, ‘మహర్షీ! సాక్షాత్తు బృహస్పతి వంటి మిమ్మల్ని మా మేనమామ నా వద్దకు పంపిన కారణమేమిటి? ఆయన ఏమైనా చెప్పాడా?’ అని అడిగాడు.

‘రామా! మీ మేనమామ యుధాజిత్తు నీతో చెప్పమన్న సందేశాన్ని చెబుతున్నాను విను! మా కేకయ రాజ్యానికి ఇరువైపులా గంధర్వ రాజ్యం ఉంది. శైలూషుడనే వాడు గంధర్వులకు రాజు. అమిత బలశాలురు, యుద్ధ విశారదులు, కామరూపధారులు అయిన గంధర్వులు కేకయ రాజ్యానికి చిరకాలంగా సమస్యగా మారారు. అందువల్ల నువ్వు గంధర్వ రాజ్యాన్ని జయించి, అక్కడ నీ అధీనంలో రెండు నగరాలు నిర్మించుకున్నట్లయితే ప్రశస్తంగా ఉండగలదు’ అని చెప్పాడు.

‘మహర్షీ! తప్పకుండా మా మేనమామ చెప్పిన ప్రకారమే చేస్తాను. ఈ కార్యభారాన్ని నా సోదరుడు భరతుడికి అప్పగిస్తున్నాను. భరతుడి కుమారులైన తక్షుడు, పుష్కలుడు మా మేనమామ ఆదేశాలకు అనుగుణంగా నడుచుకోగలరు. వీరులైన ఈ కుమారులిద్దరూ భరతుడితో కలసి, గంధర్వరాజ్యాన్ని జయించుకోగలరు. భరతుడు కుమారులిద్దరికీ రెండు నగరాలను నిర్మించి ఇచ్చి, తిరిగి నా వద్దకు రాగలడు’ అని పలికాడు.

తర్వాత రాముడు సైన్యాన్ని సమాయత్తం చేసి, భరతుడికి అప్పగించాడు. భరతుడి కుమారులిద్దరికీ గంధర్వరాజ్యంలో నిర్మించబోయే పురాలకు అధిపతులుగా పట్టాభిషేకం జరిపించాడు. సుముహూర్తం చూసుకుని, గార్గ్యుడిని ముందుంచుకుని భరతుడు తన కుమారులను, సైన్యాన్ని వెంటపెట్టుకుని బయలుదేరాడు. 

రాముడు ఆ సైన్యాన్ని అయోధ్య నగరం పొలిమేరల వరకు అనుసరించి, సాగనంపాడు. భరతుడి సైన్యం వెంట వేలాది క్రూరమృగాలు, భయంకరమైన రాక్షసమూకలు కూడా యుద్ధంలో శత్రువుల రక్తం తాగాలనే కోరికతో బయలుదేరాయి. దారిలో అక్కడక్కడా మజిలీలు చేస్తూ, మూడు పక్షాలు ప్రయాణం చేశాక భరతుడి సైన్యం కేకయ దేశంలోకి ప్రవేశించింది. 

యుధాజిత్తు భరతుడికి, అతడి సైన్యానికి ఘనస్వాగతం పలికాడు. గార్గ్యుడిని పూజించి, సత్కరించాడు. తర్వాత తన సైన్యాన్ని కూడా సమాయత్తం చేసి, భరతుడి సైన్యంతో కలసి వెళ్లి గంధర్వదేశాన్ని అన్ని వైపుల నుంచి ముట్టడించాడు. యుధాజిత్తు తన మేనల్లుడు భరతుడితో కలసి వచ్చి, రాజ్యాన్ని ముట్టడించిన సంగతి తెలుసుకున్న గంధర్వులు రెచ్చిపోయారు. రథాలను, ఆయుధాలను సిద్ధం చేసుకుని యుద్ధానికి బయలుదేరారు.

భరతుడి సైన్యానికి, గంధర్వులకు ఏడురోజులు హోరాహోరీగా యుద్ధం సాగింది. ఇరువైపులా పెద్దసంఖ్యలో సైనికులు నేలకొరిగారు. భరతుడి సైన్యం వెంట వచ్చిన క్రూరమృగాలు నేలకొరిగిన వారిని సుష్టుగా ఆరగించసాగాయి. జయాపజయాలు ఎటూ తేలని పరిస్థితి ఏర్పడింది. సహనం నశించిన భరతుడు చివరకు సంవర్తాస్త్రాన్ని ప్రయోగించాడు. 

యముడి కాలదండంలాంటి సంవర్తాస్త్రం నిప్పులు చిమ్ముతూ వెళ్లి నిమిషం వ్యవధిలోనే మూడుకోట్ల మంది గంధర్వులను మట్టుబెట్టింది. భరతుడు ఆ ఒక్క నిమిషంలో చేసిన యుద్ధం అంతకు మునుపు దేవతలు కూడా ఏ సందర్భంలోనూ చేసి ఎరుగరు. గంధర్వులపై భరతుడి యుద్ధాన్ని ఆకాశమార్గం నుంచి దేవతలు చకితులై తిలకించారు. యుద్ధం ముగిసిన వెంటనే భరతుడి పరాక్రమానికి నీరాజనంగా పుష్పవృష్టి కురిపించారు. 

గంధర్వ రాజ్యాన్ని దిగ్విజయంగా స్వాధీనం చేసుకున్న భరతుడు, అక్కడ ఐదేళ్లు ఉన్నాడు. ఆ ఐదేళ్లలో తన కుమారుల కోసం రెండు గొప్ప నగరాలను నిర్మించాడు. విలాసవంతమైన భవంతులు, మనోహరమైన ఉద్యానవనాలు, కళకళలాడే విపణి వీథులు, వినోద మందిరాలు, విశాలమైన రహదారులతో; అజేయమైన అశ్వశాలలు, గజశాలలు, సైనిక స్థావరాలతో; గొప్ప ధనాగారాలతో, ఆయుధాగారాలతో నిర్మించిన ఆ నగరాల నిర్మాణం ఇంద్రుడి అమరావతికి, కుబేరుడి అలకాపురికి తీసిపోని రీతిలో జరిగింది. వాటిలో తక్షశిల అనే నగరానికి తక్షుడిని, పుష్కలావత నగరానికి పుష్కలుడిని రాజులుగా చేశాడు. 

కొన్నాళ్లు కొడుకుల వద్ద ఉండి, వారికి రాజ్యపాలనలో అనుసరించవలసిన ధర్మసూక్షా్మలను బోధించి, భరతుడు తిరిగి అయోధ్యకు పయనమయ్యాడు. అయోధ్యకు చేరుకున్న తర్వాత నేరుగా రాముడిని కలుసుకున్నాడు. రాముడికి నమస్కరించి, గంధర్వరాజ్యాన్ని ముట్టడించినది మొదలుకొని, ఏడురోజులు జరిగిన యుద్ధాన్ని సవివరంగా చెప్పాడు. రెండు పురాలను నిర్మించి, తన కుమారులకు అప్పగించిన సంగతిని తెలిపాడు. భరతుడు సాధించిన విజయానికి రాముడు సంతోషించాడు. లక్ష్మణ, శత్రుఘ్నులు కూడా భరతుడిని అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement