ఎవరీ ధీర..మయూర? ఆశావాదం, అసామాన్య ధైర్యానికి చిరునామ.. | Belagavi Mayura Shivalkar a breast cancer survivor marathoner | Sakshi
Sakshi News home page

ఎవరీ ధీర..మయూర? ఆశావాదం, అసామాన్య ధైర్యానికి చిరునామ..

Jun 1 2025 8:58 AM | Updated on Jun 1 2025 8:58 AM

Belagavi Mayura Shivalkar a breast cancer survivor marathoner

‘ది సెకండ్‌ విండ్‌’ చిత్రానికి వచ్చిన అంతర్జాతీయ గుర్తింపు, ప్రశంసల మాట ఎలా ఉన్నా... ‘ఎవరీ మయూర శివల్కర్‌?’ అనే ప్రశ్న ఒకటి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ముగ్గురు మహిళల నిజజీవిత సంఘటనల ఆధారంగా ఇందిర బైరికర్‌ ‘ది సెకండ్‌ విండ్‌’ చిత్రాన్ని రూపొదించారు. ఆ చిత్రంలో మయూర శివల్కర్‌ జీవితం కూడా ఉంది...

కర్నాటకలోని బెల్గావికి చెందిన మయూర శివల్కర్‌ మారథానర్, అథ్లెట్, బ్రెస్ట్‌ కేన్సర్‌ సర్వైవర్‌. ‘ది సెకండ్‌ విండ్‌’లో మయూర శివల్కర్‌ పాత్ర భావోద్వేగాలకు పరిమితమైనదే కాదు ప్రభావం వంతమైనది.ధైర్యమిచ్చేది... దారి చూపేది.

ముప్పైలలో తనకు బ్రెస్ట్‌ కాన్సర్‌ అని నిర్ధారణ అయినప్పుడు ఆమె కాసేపు విచారపడి ఉండొచ్చుగానీ కష్టాలు, ప్రతికూలతలకు తలవొగ్గకూడదని నిర్ణయించుకుంది. పోరాట బాటను ఎంచుకుంది. ఎన్నో మారథాన్‌లలో ఉత్సాహంగా పాల్గొంది. ఆమె పేరు ఆశావాదానికి అరుదైన ప్రతీకగా మారింది. మయూర ఆశావాదమే, అరుదైన ధైర్యమే ‘ది సెకండ్‌ విండ్‌’ కథలోకి వచ్చింది. కాస్త వెనక్కి వెళితే... మయూర రేసులలో పాల్గొన్నప్పుడల్లా... ‘ఈ పరిస్థితుల్లో ఎందుకు?’ అన్నవారు లేకపోలేదు.

ఆ సందేహానికి ఆమె చిరునవ్వే... సమాధానం. 36 నుంచి 37 డిగ్రీల టెంపరేచర్‌లోనూ రేస్‌ను పూర్తి చేసింది. తాను యావరేజ్‌ స్విమ్మర్‌ అయినా తొలి సీ–స్విమ్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. బైకింగ్‌లోనూ ‘వావ్‌’ అనేలా చేసింది. ‘ఎప్పుడూ ఉత్సాహంగా కనిపిస్తావు! ఇది ఎలా సాధ్యం?’ అని మయూరను అడిగేవారు. ఉత్సాహం కొని తెచ్చుకునేది కాదు కదా!

అది ఆమె రక్తంలోనే ఉంది. మయూర తల్లిదండ్రులు ఆమెకు తల్లిదండ్రులు మాత్రమే కాదు స్నేహితులు, మార్గదర్శకులు. ‘నా తల్లిదండ్రులు ఒకమాట చెప్పే వారు... మొదటి నుంచి నీదైన ఒక మార్గాన్ని ఎంచుకున్నావు. ఆ మార్గం నుంచి బయటకు రావద్దు. మంచి రోజులను ఎంజాయ్‌ చేసినట్లే, చెడు అనుకునే రోజులను ఎంజాయ్‌ చెయ్‌. ఫుల్‌స్టాప్‌ కంటే కామా బెటర్‌’ అని గతాన్ని గుర్తు చేసుకుంది మయూర శివల్కర్‌. 

(చదవండి: S Jaishankar: చాలా ఏళ్లుగా ఆ అలవాటు ఉంది'! వర్క్‌ లైఫ్‌ బ్యాలెన్స్‌పై జైశంకర్‌ మాట)

Advertisement
 
Advertisement
Advertisement