మిత్ర పురుగులకు సేంద్రియ పంటల స్తన్యం!

Allied Worms Useful Agriculture And Organic Crops Farming In Sagubadi - Sakshi

ప్రకృతిలో ప్రతి మొక్కా, చెట్టూ తాను బతకడమే కాకుండా తల్లి పాత్రను సైతం పోషిస్తున్నాయా? మిత్ర పురుగులు, వేర్ల వద్ద మట్టిలోని సూక్ష్మజీవరాశికి పోషక ద్రవాలను స్రవిస్తూ తల్లి మాదిరిగా స్తన్యం పట్టి పెంచి పోషిస్తున్నాయా? అవుననే అంటున్నారు శాస్త్రవేత్తలు. మొక్కలు, చెట్లు.. ఆ మాటకొస్తే పంట మొక్కలు, పండ్ల చెట్లు తమ వేర్ల ద్వారా భూమిలోని సూక్ష్మజీవరాశి మనుగడ కోసం పోషక ద్రవాలను విడుదల చేస్తూ ఉంటాయి. ఈ పోషకాలతో మనుగడ సాగించే సూక్ష్మజీవరాశి కార్యకలాపాల వల్ల మట్టిలోని పోషకాలు వేర్లు ఉపయోగించుకోగలిగే రూపంలోకి మారి ఆయా మొక్కలు, పంటల వేరు వ్యవస్థకు అందుబాటులోకి వస్తున్నాయి. అదే విధంగా, సేంద్రియ / ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగవుతున్న లేదా ప్రకృతిలోని మొక్కలు, చెట్లు, పంట మొక్కలు తమ ఆకుల ద్వారా కూడా మిత్ర పురుగుల సంరక్షణ కోసం నీటి బిందువులను వెలువరిస్తున్నాయి. ఈ బిందువుల్లో ఉన్నది వట్టి నీరేనని  శాస్త్రవేత్తలు గతంలో అనుకున్నారు. అయితే, నీటితోపాటు పిండి పదార్థాలు, మాంసకృత్తులు కూడా ఈ బిందువుల ద్వారా మిత్ర పురుగులకు అందుతున్నాయని అమెరికాలోని రట్‌గెర్స్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల తాజా పరిశోధనలో గుర్తించారు. 

సేంద్రియ పద్ధతుల్లో సాగవుతున్న బ్లూబెర్రీ పండ్ల చెట్ల ఆకులపై ఒక సీజన్‌ కాలం ఈ అధ్యయనం జరిగింది. పంటలకు మిత్ర పురుగులైన తేనెటీగలు, కందిరీగలు, ఈగలు ఈ ఆకులు అంచుల నుంచి జాలువారే పోషకాలతో కూడిన నీటి బిందువులను ఆస్వాదిస్తూ సుభిక్షంగా జీవిస్తున్నాయని పరిశోధకులు తేల్చారు. మకరందం అందుబాటులో లేని కాలంలో మిత్రపురుగులకు ఈ పోషక నీటి బిందువులే ప్రధాన ఆహారంగా ఉంటున్నాయని, నీటితోపాటు పిండి పదార్థం, మాసంకృత్తులు కూడా ఈ నీటి బిందువుల ద్వారా మిత్ర పురుగులకు అందుతున్నాయని శాస్త్రవేత్తలు తొట్ట తొలిసారి గుర్తించటం విశేషం. తద్వారా మిత్ర పురుగుల సంతతి బాగా వృద్ధి అవుతోందని, ఫలితంగా పంటకు హాని కలిగించే పురుగుల సంఖ్య తగ్గి, చీడపీడల బెడద తగ్గుతున్నదని కూడా శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడైంది. ఈ పరిశోధనాల ఫలితాలు వ్యవసాయ, సహజ పర్యావరణ వ్యవస్థల పరిరక్షణలో మిత్ర పురుగుల ప్రాధాన్యతను మరింతగా గుర్తెరగడానికి దోహదపడుతున్నాయి. వరి, గోధుమ, బార్లీ, ఓట్స్, జొన్న, మొక్కజొన్న, పొగాకు, టమాటో, స్ట్రాబెర్రీ, కీరదోస వంటి అనేక పంట మొక్కలు కూడా బ్లూబెర్రీ పండ్ల చెట్ల మాదిరిగానే ఆకుల ద్వారా పోషక నీటి బిందువులను మిత్ర పురుగుల కోసం స్రవిస్తూ ఉండొచ్చని రట్‌గెర్స్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. 

‘మకరందం, పుప్పొడి, కీటకాలు తినడానికి తగినంతగా దొరకని రోజుల్లో రకరకాల మిత్ర పురుగుల ఆకలి తీర్చడానికి సేంద్రియ పద్ధతుల్లో సాగయ్యే పంట చెట్ల ఆకులు స్రవించే పోషక ద్రవాలు దోహదపడుతున్నాయని తెలియజెప్తున్న ఈ పరిశోధనా ఫలితాలు ఎంతో ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి’ అంటున్నారు రట్‌గెర్స్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త డా. రోడ్రిగ్యూజ్‌ సవోన అంటున్నారు. ఇతర జాతుల పండ్ల చెట్లు, పంటలపై ఇదే మాదిరి పరిశోధన చేయబోతున్నామన్నారు. రసాయనిక పురుగుమందులు చల్లిన తర్వాత పంట మొక్కలు,పండ్ల చెట్ల ఆకులు స్రవించే నీటి బిందువుల్లో పురుగుమందుల అవశేషాలు ఎంత మేరకు ఉంటున్నాయి, వాటి ప్రభావం మిత్ర పురుగులపై ఎలా ఉంది అనే అంశాలపై పరిశోధన చేయబోతున్నామని డా. రోడ్రిగ్యూజ్‌ సవోన తెలిపారు. రసాయనాలు వాడకుండా సాగు చేసే పంటలు, పండ్ల తోటల్లో మిత్ర పురుగుల వృద్ధికి ఉన్న సానుకూల పరిస్థితులను ఈ అధ్యయనం వెలుగులోకి తెచ్చింది. సేంద్రియ, ప్రకృతి వ్యవసాయ పద్ధతుల ఆవశ్యకతను ఈ అధ్యయనం చాటిచెబుతోంది.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top