
అహ్మదాబాద్ సమీపంలో జూన్ 12న జరిగిన ఎయిర్ ఇండియా ప్రమాదం యావత్తు దేశాన్ని దిగ్బ్రాంతికి గురిచేసింది. ఈ ఘటనలో మృతి చెందిన బాధితుల కథలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఒకరు తల్లిదండ్రులు కలవాలనుకుంటే..మరొకరు కుటుంబంతో కలిసి ఆనందంగా లండన్‌లో గడపొచ్చని..ఇలా ఒక్కొక్కరూ ఒక్కో కమ్మని కలతో లండన్‌కి పయనమయ్యారు. అయితే గమ్యం చేరక ముందే ఘోర ప్రమాదానికి బలయ్యారు. అదే ప్రమాదంలో చనిపోయిన ఒక యువ దంపతుల కథ వింటే కళ్లు చెమర్చక మానవు.
గుజరాతీకి చెందిన ఈ జంట తమ కంటి పాప రాకను స్వాగతించాలనే ఆకాంక్షతో ఆనందంగా లండన్‌కు పయనమైంది. అంతలోనే ఎయిర్ ఇండియా ఘోర ప్రమాదం ఆ ఆనందాన్ని క్షణాల్లో ఆవిరి చేసేసింది. ఇద్దరు ఆ విమాన ప్రమాదంలో అసువులు బాశారు. తమవాళ్లకు తీరని శోకం మిగిల్చారు. వారే వైభవ్ పటేల్, జినాల్ గోస్వామి దంపతులు.
జినాల్ గోస్వామి ఏడు నెలల గర్భిణి. సీమంతం వేడుక కోసం ఆ దంపతులిద్దరు లండన్ నుంచి అహ్మదాబాద్‌కు వచ్చారు. ఇక్కడే ఆ వేడుకని ఘనంగా చేసుకుని తిరిగి లండన్ పయనమయ్యారు. తమ తొలి సంతనం రాకకే ఎంతో ఆనందంగా ఎదురు చూసిన ఆజంట ఊహించిన ఈ విమాన ప్రమాదంలో దుర్మణం పాలయ్యారని అతడి సన్నహితుడు నీరవ్ చెబుతున్నారు.
తనకు వైభవ్ చాలా ఏళ్లుగా తెలుసునని ఇటీవలే లండన్‌లోని క్రోయ్‌డాన్‌లో స్థిరపడ్డాడని అన్నారు. అతడికి పెళ్లై నాలుగేళ్లు అయ్యిందని. తమ కుటుంబంలోకి కొత్తగా రాబోతున్న బిడ్డ కోసంఎంతో సంతోషంతో ఉన్న ఆ దంపతులు ఇలా ఈ ప్రమాదానికి బలైపోవడం జీర్ణించుకోలేపోతున్నామని కన్నీటిపర్యంతమయ్యాడు నీరవ్.
కాగా, అహ్మదాబాద్ సమీపంలో ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ టేకాఫ్ అయిన కొన్ని సెకన్లలోనే కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో దాదాపు 241 మంది మరణించగా, భారత సంతతి బ్రిటిష్ వ్యాపారవేత్త 40 ఏళ్ల రమేష్ విశ్వాస్ ఒక్కడే బతికిబట్టకట్టాడు.
(చదవండి: హాట్‌టాపిక్‌గా విమానంలోని 11A సీటు..ఎవ్వరూ ఎందుకిష్టపడరంటే..?)