వైకుంటపాళి.. అష్టాచెమ్మా.. వామనగుంట.. పులి–మేక.. ఈ పేర్లన్నీ ఇప్పటి తరానికి తెలియకపోవచ్చు. ఆన్‌లైన్ గేమ్స్‌కు అలవాటు పడిన నేటితరానికి అప్పటి ఆటల్లో ఉన్న మజా.. అసలే తెలియకపోవచ్చు. అలాంటి ఆటల పట్ల బాలలకు ముచ్చటగొలిపేలా కృషి చేస్తోంది.. ‘క్రీడ’ సంస్థ. వీరితోపాటు పెద్దలకు సైతం గత స్మృతులను గుర్తుచేసే ప్రయత్నం చేస్తోంది.. ఈ ఆటలు ఆడిన నగరానికి చెందిన కొందరు పెద్దలు చాలా కాలం తర్వాత ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా గడిపామని చెబుతున్నారు. 
నగరీకరణలో భాగంగా మనలో చాలా మంది ఆర్టిఫీషియల్ లైఫ్‌కి అలవాటుపడిపోయారు. ఎంత వరకూ ఉద్యోగాలు, వ్యాపారాలు, సమాజిక మాధ్యమాలు ఇవే తప్ప సహజసిద్ధమైన ఆటలను మర్చిపోతున్నారు. ఒత్తిడిని తగ్గించి మానసిక ఆనందానికి దోహదపడే అచ్చతెలుగు ఆటలైన వైకుంఠపాళి.. అష్టాచెమ్మా.. వామనగుంట.. వంటి పేర్లన్నీ వింటుంటే 1970–80 కాలం నాటి రోజులు తప్పకుండా గుర్తుకొస్తాయి.. 
మైక్రో ఫ్యామిలీలుగా మారిపోతున్న కల్చర్‌లో నానమ్మలు, తాతయ్యల వద్ద పెరిగే వారే లేరంటే అశ్చర్యపోవాల్సిన పని. ఒకవేళ ఉన్నా.. టెక్నాలజీ మోజులో పడి పులిని చూసి నక్క వాతబెట్టుకున్న చందాన ఆన్‌లైన్ గేమ్స్ అలవాటు చేసి.. ఇప్పుడు అవస్థలు పడుతున్నారు.
ఉమ్మడి కుటుంబాలకు దూరమైన కొందరు ఒంటరితనాన్ని తగ్గించుకునేందుకు సామాజిక మాధ్యమాల చట్రంలో ఇరుక్కుపోయి వాటికి పూర్తిగా బానిసలవుతున్నారు. నగరంలోని ‘క్రీడ’ సంస్థ ఈ ఆటలపట్ల అవగాహన కల్పించేందుకు కృషి చేస్తోంది.
బంజారాహిల్స్ రోడ్డు నెంబర్–12 లోని క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ ఆవరణలో నాటితరం ఆటలను నేటి తరానికి పరిచయం చేస్తోంది. అందుకు తగిన ఏర్పాటను సైతం చేసింది. పిల్లలు పెద్దలు చక్కగా ఆటలోని మజాను ఆస్వాదిస్తున్నారు. క్రీడ సంస్థ ప్రయత్నాన్ని అభినందిస్తున్నారు.
80 ఏళ్లు పైబడిన వారు కూడా.. 
అలనాటి ఆటలు ఈ తరానికి పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయగా.. అప్పటి తరంలోని కొందరు.. 80 ఏళ్లకు పైబడిన వారు కూడా ఇందులో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. పులి–మేక, దాడీ, అచ్చంగిల్ల వంటి ఆటలను ఆడించడమే కాదు.. నాటి, నేటి తరానికి చెందిన కొందరికి ఈ ఆటలను ఎలా ఆడాలో నిర్వాహకులే నేర్పిస్తున్నారు.. పిల్లలు, పెద్దలు కూడా ఈ ఆటలను ఎంతో ఆసక్తిగా నేర్చుకుంటున్నారు. 
మెదడుకు పదును.. 
ఈ ఆటలు ఎంతో ఆసక్తికరంగా సాగుతాయని, వీటిని ఆడటం వల్ల మెదడుకు పదును పెరుగుతుందని, పైగా దీనివల్ల దు్రష్పభావాలు కూడా ఏమీ ఉండవని, ఒత్తిడిని సైతం జయించవచ్చని పలువురు నిపుణులు, సైకాలజిస్టులు చెబుతున్నారు. 
ఇటువంటి ఆటల వల్ల పిల్లల్లో ఏకాగ్రత పెరుగుతుందని, పైగా క్రీడాస్ఫూర్తి కూడా పెరుగుతుందని, ఓటమిని సైతం తట్టుకునే శక్తి వస్తుందని, పైగా పరిచయాలు బలపడతాయని చెబుతున్నారు. మెల్లమెల్లగా కనుమరుగవుతున్న ఇటువంటి ఆటలను క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ వెలుగులోకి తీసుకురావడం మంచి పరిణామమని చెబుతున్నారు.
నేటి తరం కోసం.. 
నాకు మా అమ్మమ్మ అష్టాచెమ్మాతో పాటు వామనగుంట, వైకుంఠపాళి, సోలాసీబీ వంటి ఆటలను నేరి్పంచింది. మా అమ్మకు ఈ ఆటలన్నీ రావు. నాకు నేర్చుకోవాలని ఉన్నా చెప్పేవారు లేరు. పిల్లలకు వీటి గురించి చెప్పేవారే కరువయ్యారు. 
అందుకే క్రీడ అనే సంస్థ ద్వారా నెలలో 25 రోజుల పాటు వివిధ నగరాల్లో ఈ ప్రదర్శనను ఏర్పాటు చేస్తున్నాను. ఇది పూర్తిగా ఉచితం. చిన్నా పెద్దా అందరూ వచ్చి ఆడుకోవచ్చు. వీటి గురించి నేరి్పంచడమే కాకుండా ఆడిస్తాం. ఇక్కడ రోజుకు 200 మంది వరకూ వస్తున్నారు. 
– వినీత సిద్ధార్థ, క్రీడ సంస్థ నిర్వాహకులు
ఇదో మంచి ప్రయత్నం.. 
మా దగ్గర అలనాటి ఆటల ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నారని తెలియగానే ఎంతో సంతోషమేసింది. ఈ ఆటల గురించి తెలియని వారికి ఈ ప్రదర్శన ఎంతగానో ఉపయోగపడుతుంది. నేను కూడా సరదాగా ఆడుకున్నా. 
ఈ ప్రయత్నం అభినందించదగ్గ విషయం. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని ఏర్పాటు చేయిస్తాం. పిల్లలు, పెద్దలు ఇందులో పాల్గొనడం ఆనందంగా ఉంది. కొద్దిసేపు నేను కూడా ఆడుకుని నాటి రోజులను గుర్తుచేసుకున్నా. 
– విజయలక్ష్మి, సీసీటీ సభ్యురాలు  
(చదవండి: Masaba Gupta Weight Loss Tips: డెలివరీ తర్వాత బరువు తగ్గాలంటే..! మసాబా గుప్తా హెల్త్ టిప్స్)

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
