
పెళ్లి, పిల్లలు, కెరీర్ సెటిల్‌మెంట్‌తో ఉక్కిరిబిక్కిరి అవుతుంటారు అందరు. కాసేపు మన బాల్యపు స్మృతుల్లోకి వెళ్దామన్నా..ఆలోచన కూడా రాదు. కానీ ఒక్కసారి నాటి స్నేహితులను, నాటి చిలిపి పనులు గుర్తొస్తేనే..కళ్ల నుంచి నీళ్లు అప్రయత్నంగా జాలువారతాయి. ఆ స్వీట్‌మెమొరీస్ ఎవ్వరికుండవు చెప్పండి. కాకపోతే..ఉరుకుల పరుగుల జీవన విధానంలో కాసేపు ఆగి వెనక్కి చూసే అవకాశం చిక్కకపోవడమే తప్ప. నాటి స్నేహితులను కలిసినా..టచ్‌లో ఉన్నా..కళ్లముందు ఆ మధుర జ్ఞాపకాలు మెదిలాడుతూనే ఉంటాయి. ఇప్పుడిదంతా ఎందుకంటే అలాంటి భావోద్వేగపు ఆనందంతో ఉబ్బితబ్బిబవుతున్నారు ఈ ఐదుగురు ఆంటీలు.
ఒక మహిళ తన నలుగురు స్నేహితులతో కలసి తాము చదువుకున్న పాఠశాల కార్మెల్ కాన్వెంట్ హై స్కూల్ MAMCని సందర్శిస్తారు. అదికూడా దాదాపు 40 ఏళ్ల అనంతరం తమ చిన్ని నాటి జ్ఞాపకాలను వెదుకుతూ..వచ్చారు ఆ ఐదుగురు 50 ఏళ్ల మహిళలు. ఆ పాఠశాల ఆవరణం, తరగతి గదులు చూస్తూ..నాటి మధుర స్మృతుల్లోకి జారిపోయారు.
అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ ఐదుగురు ఆంటీల్లో ఒకామె తాము సరిగ్గా 40 ఏళ్ల తర్వాత మా స్వీట్‌మెమొరీస్ వెతుక్కుంటూ ఈ స్కూల్‌కి వచ్చాం. తాము 56 ఏళ్ల చిన్నారులమని నవ్వుతూ చెబుతున్నారు ఆ వీడియోలో. ఇక్కడ మా కలలు కనిపిస్తాయి. మేం చేసిన చిలిపి అల్లర్లు గుర్తుకొస్తాయి. ఈ పాఠశాల కలియ తిరుగుతుంటే..మా కాలు తడబడదు..భావోద్వేగంతో ఉబ్బితబ్బిబవుతుందంటున్నారు వారంతా.
ఆ మహళలంతా చీరలు ధరించి అలనాటి జ్ఞాపకాలను గుర్తుతెచ్చుకుంటూ ఆ పాఠశాల చుట్టూ కలియతిరిగారు. తాము ఆ పాఠశాలో 1987 బ్యాచ్‌కి చెందినవాళ్లమని చెప్పుకొచ్చారు కూడా. ఈ మధురానుభూతి వెలకట్టలేనిది, మాటలకందనిది అంటున్నారు ఆ మహిళా స్నేహితులు. ఈ వీడియో నెటిజన్లను తెగ ఆకర్షించడమే గాక అంతా తమ బాల్యపు స్మతుల్లోకి వెళ్లిపోయారు. ఎవ్వరికైనా.. స్కూల్ చదువు ఓ అద్భుత వరం..అది ఎవ్వరికైనా మధురానుభూతులను పంచే గొప్ప భావోద్వేగపు అనుభూతి కదా..!.
(చదవండి: ఓ మనిషి ఒత్తిడికి చిక్కకు! ఈ జాగ్రత్తలు సూచిస్తున్న నిపుణులు)