ఓ మనిషి ఒత్తిడికి చిక్కకు! | Helath tips: mental wellbeing Simple Ways to Relieve Stress and Anxiety | Sakshi
Sakshi News home page

World Brain Day 2025: ఓ మనిషి ఒత్తిడికి చిక్కకు! ఈ జాగ్రత్తలు సూచిస్తున్న నిపుణులు

Jul 22 2025 12:00 PM | Updated on Jul 22 2025 12:25 PM

Helath tips: mental wellbeing Simple Ways to Relieve Stress and Anxiety

మనిషి శరీరంలో మెదడు అద్భుత శక్తివంతమైన భాగం. ప్రశాంతతకు, మన భవితను నిర్ణయించే నిర్ణయాలు తీసుకోవడంలో మెదడుపాత్ర అత్యంత కీలకం. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందినకొద్దీ మెదడుపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ తరుణంలో మనిషి మెదడుకు మరింత పదును పెట్టాలి్సన పరిస్థితి. సాఫ్ట్‌వేర్‌ రంగంలో పనిచేసేవారు రోజుకు 12 గంటలు కంప్యూటర్లకే అతుక్కుని పోతుండగా.. ఏ పనీపాట లేనివారు రోజుకు 18 గంటలు సెల్‌ఫోన్లో గడుపుతున్నారు. మెదడు ఒత్తిడికి గురై న్యూరో సమస్యలు పెరుగుతున్నాయి. బ్రెయిన్‌ స్ట్రోక్, డిమెన్షియా, అల్జీమర్స్, బ్రెయిన్‌ ట్యూమర్‌ వంటి మెదడు వ్యాధులతో బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఏటా జూలై 22న జాతీయ మెదడు దినోత్సవం నిర్వహిస్తున్న సందర్భంగా కథనం..               

‘గతం గురించి ఆలోచించను. భవిష్యత్తుపై బెంగపెట్టుకోను. వర్తమానంలోనే జీవిస్తా. అందుకు తగ్గట్టు ప్రణాళికలు రచిస్తా. ఫలితం కంటే ప్రక్రియపై దృష్టిసారిస్తా. ప్రక్రియ ఉప ఉత్పత్తే ఫలితం’ అని అంటాడు మహేంద్రసింగ్‌ ధోని.  

శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. మెదడుకు వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. బ్రెయిన్‌కు వచ్చే ప్రమాదకర వ్యాధులలో బ్రెయిన్‌ ట్యూమర్ల కేసులు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. ఉదయం నిద్ర లేవగానే విపరీతమైన తలనొప్పి వస్తే, మాట్లాడడంలో ఇబ్బంది ఉంటే ఇవి బ్రెయిన్‌ ట్యూమర్‌ లక్షణాలు. మెదడుపై ఒత్తిడి పెరగడం వల్ల ఇటీవల పక్షవాతం, పార్కిన్సన్‌ వంటి వ్యాధులు పెరుగుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఈ వ్యాధులు మెల్లమెల్లగా మనిషి శరీరాన్ని నిర్వీర్యం చేస్తున్నాయి.

తేలికగా తీసుకోవద్దు...
మెదడు మన మొత్తం శరీరంలో అత్యంత ముఖ్యమైన భాగం. మెదడుకు సంబంధించిన ఏ వ్యాధి వచ్చినా తేలిగ్గా తీసుకోకూడదు. రోగికి తలలో నిరంతరం నొప్పి, జ్ఞాపకశక్తి కోల్పోవడం, తల పరిమాణం పెరగడం, ఏదైనా ప్రమాదంలో తలకు గాయాలు లేదా గందరగోళ స్థితి ఉంటే ఇవన్నీ మెదడు వ్యాధుల లక్షణాలే. 

అత్యంత ముఖ్యమైన అవయవాలలో ఒకటి అయినప్పటికీ మెదడు ఆరోగ్యాన్ని తేలికగా తీసుకుంటారు. దీంతో న్యూరో రోగుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. మెదడు సంబంధ వ్యాధులతో పోరాడుతున్న ఏ వయసు వారికైనా ఆరోగ్యకరమైన జీవనశైలి అవసరమని వైద్యులు చెబుతున్నారు.

ఆదిలోనే గుర్తిస్తే..
శరీరం, మనసు ఆరోగ్యంగా ఉంటేనే ఏపనినైనా చురుగ్గా చేసుకోగలం. అదే ప్రతికూల ఆలోచనలు మనసులోకి చేరితే ఒత్తిడిని ఎదుర్కొనటమే కాదు.. ఏపనిపైనా ఏకాగ్రత పెట్టలేం. అందుకే అలాంటి మానసిక సమస్యలను ఆదిలోనే గుర్తించాలంటున్నారు నిపుణులు. 

చాలామంది ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకోవటంతో పాటు సరైన సమయంలో గుర్తించలేకపోతున్నారని.. తద్వారా అది క్రమంగా తీవ్రమైన మానసిక ఒత్తిడిని ఎదుర్కొనే స్థితికి దారితీస్తుందంటున్నారు. ఒత్తిడి లక్షణాలను గుర్తించిన వెంటనే వైద్యులను సంప్రదిస్తే మేలని సూచిస్తున్నారు.

ఏటా సుమారు 30 వేల మంది..
ఉమ్మడి జిల్లాలో ఏటా సుమారు 30 వేల మంది మానసిక ఒత్తిళ్లతో ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నట్లు వైద్యనిపుణులు చెబుతున్నారు. వీరిలో చాలామంది ఒత్తిడికి గురయ్యాక ధూమపానం, మద్యం సేవనం, గంజాయి, డ్రగ్స్‌ వంటి వ్యసనాలకు బానిసై, తమ జీవితాన్ని మరింత ప్రమాదంలోకి నెట్టుకుంటున్నారని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. మానసిక ఆరోగ్యం పట్ల సమాజం నిర్లక్ష్యంగా ఉండటం, అవగాహన లోపించడం దీనికి ప్రధాన కారణాలుగా            చెబుతున్నారు. 

జయిద్దామిలా..

  • ఎప్పుడు ఒత్తిడికి గురవుతున్నామో ఒకచోట నమోదు చేసుకోవాలి.

  • ప్రాణాయామం, యోగా, ధ్యానం వంటి పద్ధతులు అవలంబించాలి.

  • క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.

  • ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవటంతో పాటు కంటి నిండా నిద్రపోవాలి.

  • కెఫిన్‌ ఎక్కువగా ఉండే కాపీ, శీతల పానీయాలు తాగటం మానేయాలి.

  • ప్రతికూల ఆలోచనలను మొగ్గ దశలోనే తుంచేయాలి.

  • ఒత్తిడికి గురైనప్పుడు.. దాని నుంచి బయ టపడటానికి కుటుంబ సభ్యులు, స్నేహితుల సహకారం తీసుకోవాలి.

మెదడు వ్యాధులను నిర్లక్ష్యం చేయొద్దు
మెదడుకు సంబంధించి ఎలాంటి వ్యాధి లక్షణాలు కనిపించినా నిర్లక్ష్యం చేయవద్దు. వయస్సుతో సంబంధం లేకుండా ఫిట్స్, పక్షవాతం, బ్రెయిన్‌ ట్యూమర్‌ కేసులు ఎక్కువగా పెరుగుతున్నాయి. ఈ వ్యాధులకు మానసిక ఒత్తిడే కారణం. 

ముఖ్యంగా పిల్లల్లో సెల్‌ఫోన్‌ వాడటం వల్ల మెదడుపై ఒత్తిడి పెరిగి జ్ఞాపకశక్తిని కోల్పోతున్నారు. మానసిక సమస్యలు తలెత్తుతున్నాయి. తల్లిదండ్రులు ఈ విషయంపై జాగ్రత్త వహించాలి. ప్రతీ ఒక్కరికి 8 గంటలు నిద్ర తప్పనిసరిగా అవసరం. 
– డాక్టర్‌ రాజీవ్‌రెడ్డి, న్యూరోసర్జన్, మెడికవర్‌  

(చదవండి: నేచర్‌లో' నేర్చుకో..! ఆరుబయట అభ్యాసం..అరుదైన అనుభవం..)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement