
ఆకాశంలో తారలు, చందమామల గురించి మనకు తెలుసు. చెట్లూ పుట్టల గురించి కూడా మనకు తెలుసు.. అయితే వీటిలో చాలా వరకూ మనం నాలుగు గోడల మధ్య తరగతి గదిలో కూర్చుని చదువుకున్నాం.. కాబట్టి మనకు అవగాహన ఉంది.. కానీ ఆకాశంలోకి చూస్తూ.. నక్షత్రాల గురించి, అడవిలో నడుస్తూ ఆకులు, చెట్ల గురించి తెలుసుకోవడం ఎలా ఉంటుంది? ‘అదే అసలైన చదువు’ అంటున్నారు పలువురు నగరవాసులు. అవుట్ డోర్ క్లాస్ రూమ్ లెసన్స్‌కి జై కొడుతున్నారు.
ప్రస్తుతం ఆకాశం వైపు చూడటం కంటే మొబైల్ స్క్రీన్‌లనే పిల్లలు ఎక్కువగా చూస్తున్నారు. చందమామను కూడా తల్లులు మొబైల్స్‌లోనే చూపించాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో అసలైన చదువు అంతా ఆరుబయటే ఉందని భావించిందో మిత్రబృందం. అనుకున్నదే తడవుగా ఓ కొత్త ఆలోచనకు తెరతీసింది. తద్వారా అవుట్ డోర్ క్లాస్ రూమ్ అనే కాన్సెప్ట్ డిజైన్ చేసింది. సరికొత్త తరగతి గదులను నగరవాసులకు పరిచయం చేస్తోంది. ‘ఈ కాన్సెప్‌్టని కోవిడ్ సమయంలో ఆలోచించాం. నాలుగేళ్ల క్రితం మొదలుపెట్టాం. తొలిదశలో మొత్తం ఐదారుగురమే కానీ, ఇప్పుడు మా టీమ్ 25కి చేరింది’ అంటూ చెప్పారు మాజీ ఐటీ ఉద్యోగి రాఘవ. తమ కాన్సెప్ట్ గురించి ఆయన పంచుకున్న విశేషాలు ఆయన మాటల్లోనే..
వాట్సాప్ గ్రూప్‌గా ప్రారంభమై.. నా స్నేహితుడు దేవేందర్, ఐశ్వర్యలతో కలిసి మరికొందరు స్నేహితులను ఆహ్వానించడం ద్వారా అది ఒక వాట్సాప్ గ్రూప్‌గా ప్రారంభమైంది. కాలక్రమేణా మా కార్యకలాపాలు వైవిధ్యభరితంగా మారాయి. మా టీమ్‌లో నక్షత్రాలూ పాలపుంతలను విడమరిచే ఆ్రస్టానమీ తెలిసిన నిపుణుల నుంచి గణితాన్ని ప్రకృతితో ముడిపెట్టి వివరించే మాథ్ మెటీషియన్ వరకూ.. ఒక్కొక్కరూ ఒక్కో సబ్జెక్ట్‌లో స్పెషలైజేషన్ చేసిన 25 మంది ఉన్నారు. ఎంచుకున్న టాపిక్ బట్టి వారు ఆయా సెషన్లకు హాజరవుతూ పాఠాలు బోధనలా కాకుండా ప్రాక్టికల్ అనుభవాలను అందిస్తారు.
నగరంలోని పార్కుల నుంచి కర్ణాటకలోని కూర్గ్ వరకూ..
‘నగరంలోని రాక్ ఏరియాలు, పార్కులు, లేక్స్.. ఇలా కాదేదీ క్లాస్‌రూమ్‌కి అనర్హం అన్నట్టుగా మారిపోతాయి. నగరం మాత్రమే కాదు రాష్ట్రాలు కూడా దాటుతూ, కూర్గ్ వంటి హిల్ స్టేషన్స్‌లో సైతం సెషన్స్ ఏర్పాటు చేస్తాం. ట్రెక్కింగ్, రాక్ క్‌లైంబింగ్, హైకింగ్‌లు, ఫొటో వాక్‌లు, చారిత్రక బాటలు, రాత్రుళ్లు నక్షత్రాల వీక్షణం, తల్లిదండ్రులు–పిల్లల శిబిరాలు.. ఇలా అవుట్‌డోర్ క్లాస్‌రూమ్స్ ప్రతి నెలా అనేక సెషన్‌లు నిర్వహిస్తుంది. పాఠశాల విద్యార్థుల నుంచి కార్పొరేట్ బృందాల వరకూ ఇందులో భాగస్వాములవుతున్నారు. పైగా వీరంతా ఈ తరహాబోధనకు ఆకర్షితులవుతున్నారు’ అని చెప్పుకొచ్చారు.
ఇప్పటికి దాదాపు 100కిపైగా క్లాసులు..
‘ప్రతి సెషన్‌లో కనీసం 25 నుంచి 40 మంది వరకూ స్థానం కల్పిస్తాం. నగరంలోని పలు స్కూల్స్, కార్పొరేట్ సంస్థలతో కలిసి వీటిని ప్లాన్ చేస్తుంటాం. ఇప్పటికి దాదాపు 100కి పైగానే క్లాస్ రూమ్స్ నిర్వహించాం. ఇతర నగరాల్లోనే కాకుండా భవిష్యత్తులో విదేశాలకు సైతం విస్తరించాలనే ఆలోచన చేస్తున్నాం’ అంటూ ముగించారు రాఘవ.
ఉరుకుల పరుగుల జీవితంలో నేర్చుకోవడం కూడా అంతే వేగంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో నేచర్ గురించి తెలుసుకోవడం ఎంత ముఖ్యమో.. నేచురల్‌గా నేర్చుకోవడమూ అంతే ముఖ్యం అనే ఆలోచనే ఈ తరహా అవుట్ డోర్ క్లాస్ రూమ్స్‌కి ఊపునిస్తోందనేది నిరి్వవాదమైన అంశం.
(చదవండి: