ఒత్తిడిని ఓడించడానికి నానా ప్రయత్నాలు
ఫుడ్ డెలివరీ బాయ్‌లుగా, క్యాబ్ డ్రైవర్‌లుగా పని
అదనపు సంపాదనకూ మార్గాలు
బెంగళూరులో బలపడుతున్న నయా ట్రెండ్‌లు
అదొక మాల్‌లోని మల్టీప్లెక్స్ హాల్.. ప్రేక్షకులందరూ సినిమాను చూస్తున్నారు. అయితే ఒక్క మహిళ మాత్రం సీరియస్‌గా ల్యాప్‌ట్యాప్‌లో పని చేసుకుంటున్నారు. ఆమెను ఎవరో ఫోటో తీసి సోషల్‌మీడియాలో వైరల్ చేశారు. ఈ ఫోటోను చూసిన నెటిజన్లు.. టెక్కీలకు కనీసం రెండుగంటలు సినిమా చూసేందుకు కూడా వీలు కాదా అని జాలితో హేళన చేశారు.
బెంగళూరుకు చెందిన టెక్కీ డేటా సైన్స్‌లో పని చేస్తున్నాడు. ఇతనికి ఏడాదికి రూ. 48 లక్షల వేతన ప్యాకేజీ ఉంది. మరో కంపెనీలో రూ. 75 లక్షల ఆఫర్ వచ్చింది. అయితే పన్నుల భారం పెరుగుతుందని తిరస్కరించారు. పన్నుల భారం మాత్రం రూ. 12 లక్షల నుంచి రూ. 22 లక్షలు అవుతుందని, అందుకే దానిని వద్దన్నట్లు తెలిపారు. నెటిజన్లు అతనిని విమర్శించారు.
నిఖిల్.. ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్.. ఇతడి మృతదేహం అగర చెరువులో దొరికింది. అయితే ఇతడికి పని ప్రదేశంలో తీవ్రమైన ఒత్తిడి కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడని సహోద్యోగి సామాజిక మధ్యమంలో పోస్టు చేశారు. ఈవీ స్కూటర్ కంపెనీలో ఇంజనీరు.. ఇంట్లో డెత్‌నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. నాణేనికి మరో వైపు ఇది.

సాక్షి, బెంగళూరు: పైన పేర్కొన్న దురంతాలు అనేకం. నేటి పరిస్థితుల్లో పని, జీవితం సమతూకం చేయడం సాధ్యమా అంటూ ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. దూరపు కొండలు నునుపు అనే మాదిరిగా చాలామందికి ఐటీ, సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలంటే ఎంతో మక్కువ. దండిగా జీతం, సౌకర్యాలు లభిస్తాయని అనుకున్నారు. కానీ బెంగళూరులో ఎక్కువమంది ఐటీ ఉద్యోగులు తీవ్ర ఒత్తిడి మధ్య తమ ఉద్యోగాల కొనసాగిస్తున్నారు. బిజీ జీవితం, పెరిగిన ఖర్చులు, ఈఎంఐలు, పనిలో టార్గెట్ల బెడద ఎక్కువగా ఉన్నట్లు తరచూ వాపోతుంటారు.
కొత్త దారుల్లో నడక
ఈ నేపథ్యంలో బెంగళూరులో కొందరు టెక్కీలు పని ఒత్తిడి నుంచి ఉపశమనం కోసం ఊహించని పనులు చేస్తున్నారు. ఫుడ్ డెలివరీ బాయ్‌లుగా, ట్యాక్సీ డ్రైవర్లు సేవలందిస్తూ రిలాక్స్ అవుతున్నట్లు తెలిపారు. పగలంతా ఉద్యోగంలో బిజీగా ఉండి, రాత్రి కాగానే కొత్త అవుతారం ఎత్తుతారు. మరికొందరు డబ్బు కోసమే చేస్తున్నారు. రాత్రి సమయాలో ఈ వృత్తుల్లోకి మారుతున్నారు. సంపాదిస్తున్న డబ్బులు సరిపోవడం లేదా? లేదా ఊరికే టైంపాస్ కోసం ఇలా చేస్తున్నారా అనే ప్రశ్నలు ప్రస్తుతం ఉత్పన్నం అవుతున్నాయి.
ఖరీదైన సిటీలో బతకాలిగా
ఇవే ప్రశ్నలను కొందరు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులను ప్రశ్నిస్తే ఆశ్చర్యకరమైన సమాధానాలు తెలిపారు. బెంగళూరు రోజురోజుకి ఎంతో ఖరీదు అయిన నగరంగా మారుతోంది. అందులోనూ ఐటీ కంపెనీలు ఉండే ప్రాంతాల్లో ఇంటి అద్దెలు, ఆహారం, నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. కానీ ప్రతి టెక్కీకి అందరూ అనుకున్నట్లుగా పెద్ద పెద్ద జీతాలు లభించడం లేదు. కొత్తగా కెరీర్ ప్రారంభించిన వారికి రూ. 50 వేల నుంచి రూ. 60 వేల వేతనం లభిస్తోంది. ఆ డబ్బు చాలక అదనపు మార్గాలను అన్వేíÙస్తున్నారు. పలువరు యువ ఇంజనీర్లు వారానికి రెండు రాత్రులు అయినా క్యాబ్ నడుపుతూ సంపాదిస్తారు.
యాంత్రిక జీవనం
ప్రస్తుతం బెంగళూరు టెక్కీలకు జీవితం ఒక యాంత్రికంగా మారిపోయింది. ఉదయాన్నే లేవడం, రెడీ కావడం, ఆఫీసుకు వెళ్లడం, అక్కడ రోజంతా ఒత్తిడిలో కష్టపడడం, టార్గెట్లు, తిరిగి ఇంటికి రావడం, పడుకోవడం ఇలా ఒక రొటీన్ జీవితానికి అలవాటు పడ్డారు. దీంతో జీవితంలో ఒంటరితనం పెరుగుతోంది. అలాగే మానసిక సమస్యలు, కోపం, ఉద్వేగాలు నియంత్రణలో లేకపోవడం వంటి సమస్యలు వస్తున్నాయి. వీటి నుంచి బయటకు వచ్చేందుకు తరచూ ట్రెక్కింగ్ వెళ్లడం, నైట్ పార్టీలకు వెళ్లడం చేస్తున్నారు. అయితే వీటి వల్ల ఆశించిన మేర వారికి ఫలితాలు రావడం లేదు. ఈ క్రమంలో ఒక మార్పు కోసం రాత్రి సమయాల్లో ఇతర వ్యాపకాలను అనుసరిస్తున్నారు.


