ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): విజయవాడలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న సచివాలయ ఉద్యోగులను ప్రభుత్వం అరెస్టు చేయడం దుర్మార్గమని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డీఎన్వీడీ ప్రసాద్ తీవ్రంగా ఖండించారు. స్థానిక సీఐటీయూ కార్యాలయంలో కే. శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించిన జిల్లా విస్తృత సమావేశంలో ఆయన మాట్లాడారు. పనిభారం తగ్గించాలని, వేధింపులు ఆపాలని, పని ఒత్తిడితో మరణించిన ఉద్యోగుల కుటుంబాలను ఆదుకోవాలని కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. విజయవాడ ధర్నాచౌక్‌లో ఆందోళనకు వస్తున్న ఉద్యోగులను పోలీసులు బలవంతంగా అరెస్టు చేయడం, దౌర్జన్యాలకు పాల్పడడం గర్హనీయమన్నారు. ఉద్యోగులకు నోషనల్ ఇంక్రిమెంట్లు, ఆటోమేటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్ అమలు చేయాలని, ప్రొబేషన్ అమలైన 9 నెలలకు అరియర్స్ చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల పోరాటానికి సీఐటీయూ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని, ప్రభుత్వం వెంటనే చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించాలని ఆయన కోరారు.


