కుక్కకాటు.. నిర్లక్ష్యం చేస్తే చేటు! | - | Sakshi
Sakshi News home page

కుక్కకాటు.. నిర్లక్ష్యం చేస్తే చేటు!

Sep 28 2026 1:11 AM | Updated on Sep 28 2026 1:11 AM

సకాలంలో వ్యాక్సిన్‌లు వేయించాలి

ద్వారకాతిరుమల: కుక్క కాటు చిన్న విషయమేనని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. రేబిస్‌ సోకిన కుక్కలు, పిల్లులు, ఇతర జంతువుల లాలాజలం ద్వారా ఈ వైరస్‌ మనుషులకు వ్యాపిస్తుంది. ఒకసారి వ్యాధి లక్షణాలు బయటపడిన తర్వాత రేబిస్‌ అత్యంత ప్రమాదకరంగా మారుతుంది. అందుకే జంతువుల కాటుకు గురైన వెంటనే వైద్యులను సంప్రదించడం అత్యంత కీలకం. రేబిస్‌పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం సెప్టెంబర్‌ 28న ప్రపంచ రేబిస్‌ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. రేబిస్‌ వ్యాధిని నివారించడంలో జంతువులకు టీకాలు వేయించడం, ప్రజలకు సకాలంలో చికిత్స అందించడం ప్రధానమైనవి.

గాయాన్ని వెంటనే కడగాలి

జంతువు కరిచిన వెంటనే గాయాన్ని సాధారణ (ఘాటైన రసాయనాలు లేని) సబ్బుతో, ప్రవహించే నీటితో 15 నిమిషాలపాటు బాగా కడగాలి. గాయాన్ని కట్టేయడం, ఇంటి చిట్కాలు పాటించడం వంటి వాటికి బదులుగా వీలైనంత త్వరగా సమీపంలోని వైద్య కేంద్రానికి వెళ్లాలి. వైద్యుల సూచనల మేరకు యాంటీ రేబిస్‌ వ్యాక్సిన్‌, అవసరమైతే రేబిస్‌ ఇమ్యూనోగ్లోబులిన్‌ తీసుకోవాలి. కాటు చిన్నదిగా కనిపించినా నిర్లక్ష్యం చేయకూడదు.

వీధి కుక్కలపై చర్యలేవీ

ఉమ్మడి జిల్లాలో పెరుగుతున్న వీధి కుక్కల బెడద, కుక్కకాటు కేసుల నేపథ్యంలో అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వీధి కుక్కల నియంత్రణకు స్టెరిలైజేషన్‌, యాంటీ రేబిస్‌ వ్యాక్సినేషన్‌ వంటి చర్యలను సమర్థవంతంగా అమలు చేయాలి. రేబిస్‌ సోకినవి, నయం కాని అనారోగ్యంతో ఉన్నవి, ప్రజలకు ప్రమాదకరంగా ఉన్న కుక్కల విషయంలో నిబంధనల ప్రకారం మాత్రమే ‘యూథనేషియా’ (మానవీయంగా మరణింపజేయడం) చేపట్టాలి. కుక్కకాట్ల నివారణకు పంచాయతీలు, మున్సిపాలిటీలు సమన్వయంతో ప్రత్యేక కార్యాచరణ చేపట్టి, ప్రజలకు రక్షణ కల్పించేలా వీధి కుక్కల నియంత్రణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.

వ్యాక్సిన్‌ తప్పనిసరి

రేబిస్‌ నియంత్రణలో పెంపుడు జంతువులకు సకాలంలో టీకాలు వేయించడం కీలకం. ముఖ్యంగా కుక్కలకు నిర్ణీత వయసులో యాంటీ రేబిస్‌ టీకా వేయించాలి. ఆ తరువాత కూడా పశువైద్యుల సూచన మేరకు బూస్టర్‌ డోసులు ఇప్పించాలి. పెంపుడు జంతువు ఏదైనా జంతువును కరిచినా, లేదా ఇతర జంతువులు దీన్ని కరిచినా వెంటనే పశువైద్యుడిని సంప్రదించాలి. జంతువుల కాటును నిర్లక్ష్యం చేయకుండా, టీకాల వివరాలను నమోదు చేసుకుని సకాలంలో టీకాలు వేయించాలి. ఇలా చేస్తే వ్యాధి వ్యాప్తిని తగ్గించవచ్చు.

కుక్కకాటు కేసులు జిల్లాల వారీగా...

కాలం పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు జిల్లా మొత్తం

2024 (మొత్తం) 24,121 9,570 33,691

2025 జనవరి నుంచి ఆగస్టు 9,576 4,027 13,603

2025 సెప్టెంబర్‌ నుంచి ఇప్పటి వరకు సుమారు 15 వేలకుపైగా కేసులు

పెంపుడు కుక్కలకు సకాలంలో రేబిస్‌ వ్యాక్సిన్‌లు వేయించాలి. కుక్క పిల్లలకు 3 నెలల వయసులో తొలి రేబిస్‌ టీకా వేయించాలి. ఆ తర్వాత ఏడాదికి ఒకసారి బూస్టర్‌ డోస్‌ తప్పనిసరిగా ఇప్పించాలి. కుక్కలు, పిల్లులు తదితర జంతువులు కరిచినా, గీరినా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. జంతువుల కాటుతో రేబిస్‌ ముప్పు ఉన్నందు వల్ల సకాలంలో చికిత్స, టీకాలు తీసుకోవడం ద్వారా ప్రాణాపాయాన్ని నివారించవచ్చు.

– అంగర సురేష్‌, మండల పశువైద్యాధికారి, ద్వారకాతిరుమల

రేబిస్‌ పట్ల అప్రమత్తతతో ప్రాణ రక్షణ

వీధికుక్కల బెడదతో పెరుగుతున్న ముప్పు

కాటుపడిన వెంటనే చికిత్సతో రేబిస్‌కు అడ్డుకట్ట

నేడు ప్రపంచ రేబిస్‌ దినోత్సవం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement