● స్కూలుకు వెళ్లి ఇంటికి రాని బాలిక
● మంగళగిరిలో కనిపించడంతో కథ సుఖాంతం
తణుకు అర్బన్: పాఠశాలకు వెళ్లి ఇంటికి తిరిగి రాకుండా అదృశ్యమైన బాలిక ఉదంతం సుఖాంతమైంది. తణుకు మండలం వేల్పూరు గ్రామానికి చెందిన కావాలిపురపు సత్యనారాయణ కుమార్తె పూజిత (13) స్థానిక శ్రీశారద శాంతి నికేతన్ పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. శనివారం మధ్యాహ్నం ఎప్పటిలాగే తండ్రి తన ఇద్దరు కుమార్తెలను భోజనం నిమిత్తం ఇంటికి తీసుకువచ్చి, తిరిగి పాఠశాలలో దింపి వెళ్లారు. సాయంత్రం పాఠశాల విడిచిపెట్టిన తర్వాత చిన్న కుమార్తె మాత్రమే ఇంటికి రావడంతో, పెద్ద కుమార్తె పూజిత రాలేదని గ్రహించిన తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. స్నేహితులు, బంధువుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించకపోవడంతో శనివారం సాయంత్రం తణుకు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
సీసీటీవీ పుటేజీల ఆధారంగా గాలింపు
పోలీసులు స్థానికంగా ఉన్న సీసీటీవీ పుటేజీలను పరిశీలించగా.. మధ్యాహ్నం సమయంలో పాఠశాల లోపలికి వెళ్లకుండా, స్కూలు యూనిఫామ్‌లో ఉన్న పూజిత ఎలాంటి స్కూలు బ్యాగ్ లేకుండా ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్నట్లు గుర్తించారు. చదువులో వస్తున్న మార్కులపై తల్లిదండ్రులు ఒత్తిడి చేస్తుండటంతోనే ఆమె మనస్తాపం చెంది ఇంటి నుంచి వెళ్లినట్లు అనుమానించారు. ఈ ఘటన సోషల్ మీడియాలో సైతం విపరీతంగా వైరల్ అయింది.
మంగళగిరిలో ప్రత్యక్షం
పాఠశాల వద్ద నుంచి బయటకు వచ్చేసిన పూజిత ఆర్టీసీ బస్సులో మంగళగిరి చేరుకున్నట్లు సమాచారం. రాత్రి అక్కడే గడిపిన బాలికను, ఆదివారం ఉదయం బస్టాండ్‌లో ఒక మహిళ గుర్తించి ప్రశ్నించారు. యూనిఫామ్‌లో ఉండటం, స్కూల్ ఐడెంటిటీ కార్డులోని వివరాల ఆధారంగా ఆమె కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. అనంతరం ఆ బాలికను స్థానిక పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు. అక్కడి నుంచి తణుకు పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందడంతో, పోలీసులు బాలికను సురక్షితంగా తీసుకురావడానికి మంగళగిరి వెళ్లినట్లు సమాచారం.


