చింతలపూడి: స్థానిక ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా, కనీసం గ్రామసభలు కూడా నిర్వహించకుండా రేచర్ల ప్రాంతంలోని బొగ్గు నిక్షేపాలను రిలయన్స్ సంస్థకు కట్టబెట్టడం తీవ్ర అన్యాయమని బొగ్గు బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. మండల పరిధిలోని కొమ్ముగూడెం గ్రామంలో ఆదివారం బాధితులు సమావేశమై నిరసన గళం విప్పారు. ఈ సందర్భంగా రేచర్ల బొగ్గు బాధితుల కమిటీ నాయకులు దొంతా కృష్ణ, చిట్లూరి బాలకృష్ణ మాట్లాడుతూ మెజారిటీ ప్రజల ఆమోదం లేకుండా బొగ్గు గనులను కార్పొరేట్ కంపెనీకి అప్పగించడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. గనుల తవ్వకాల వల్ల తీవ్ర పర్యావరణ విధ్వంసం జరిగి, భూగర్భ జలాలు అడుగంటిపోవడమే కాకుండా సమస్త జీవకోటికి ముప్పు వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ కేవలం రిలయన్స్ సంస్థకు లాభాలు చేకూర్చేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ప్రజా వ్యతిరేక విధానాలను కేంద్ర ప్రభుత్వం తక్షణమే విడనాడాలని, గనుల కేటాయింపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. కార్పొరేట్ శక్తుల మెప్పు కోసం ప్రభుత్వం మొండిగా ముందుకు వెళితే ప్రజల నుంచి తీవ్ర ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో రైతులు సాయిల నారాయణరావు, ఉప్పల వెంకటరమణ, బొక్క రాఘవ, బొక్క సూర్యం, వేగుంట ప్రభాకర్, సత్యనారాయణ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
వెంకటాద్రిపురంలో ప్రతీకార హత్య
కొమ్ముగూడెంలో రైతుల నిరసన


