నిండుకుండలా జలాశయాలు | - | Sakshi
Sakshi News home page

నిండుకుండలా జలాశయాలు

Sep 28 2026 1:11 AM | Updated on Sep 28 2026 1:11 AM

ఏజెన్సీ ప్రాంతంలో ఇలా..

ప్రాజెక్టుల్లో నీరు సమృద్ధిగా..

● మన్యంలో ప్రాజెక్టులకు జలకళ

● సాగుకు రైతుల సన్నద్ధం

● ఆయకట్టు పరిధిలో 30 వేల ఎకరాలు

బుట్టాయగూడెం : తీవ్ర వాయుగుండం ప్రభావంతో కురిసిన వర్షాలతో మన్యం ప్రాంతంలోని జలా శయాలు, చెరువులకు జలకళ సంతరించుకుంది. ఇప్పటివరకూ ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావం, మరో పక్క ప్రభుత్వ సహకారం కరువవడంతోపాటు వివిధ కారణాలతో ఖరీఫ్‌ సీజన్‌ సాగు ముందుకు సాగని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో అతి తక్కువ విస్తీర్ణంలో పంటల సాగు చేశారు. అది కూడా బోర్లున్న ప్రాంతాల్లో మాత్రమే సాగు మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో కురిసిన వర్షాల వల్ల రబీ సీజన్‌కు మేలు జరుగుతుందని రైతులు అంటున్నారు.

ఆయకట్టు భూములకు ఊపిరి

మన్యంలోని సుమారు 128 మైనర్‌ ఇరిగేషన్‌ చెరువుల పరిధిలోని సుమారు 30 వేల ఎకరాలకు పైగా ఆయకట్టు భూములు ఉన్నాయి. అయితే ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో తగినంత వర్షాలు కురవకపోవడంతో అతి కొద్దిమంది వరి, మొక్కజొన్న, వేరుశనగ పంటలు సాగు చేపట్టారు. అయితే ఈ భూములన్నీ వర్షాధారం మీదే ఆధారపడి ఉన్నాయి. ప్రస్తుతం భారీగా కురుస్తున్న వర్షాలతో చెరువుల్లోకి నీరు చేరడంతో తమకు సాగునీరు కొరత తీరినట్లే అని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగే చెరువులు, ప్రాజెక్టుల్లో నీరు భారీగా చేరడంతో భూగర్భ జలాలు కూడా పెరిగే అవకాశం ఉంది. దీనివల్ల బోర్లలో నీరు సమృద్ధిగా లభించనున్నాయి.

పుష్కలంగా ప్రాజెక్టుల్లో..

మన్యప్రాంతంలో ఉన్న గుబ్బల మంగమ్మ జల్లేరు జలాశయం నీటితో కళకళలాడుతుంది. ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 217.80 మీటర్లు కాగా ప్రస్తుతం వరద నీటితో 215.05 మీటర్లు సామర్థ్యంతో నిండి ఉంది. అలాగే పోగొండ రిజర్వాయర్‌ సామర్థ్యం 157 మీటర్లు కాగా సామర్థ్యాన్ని మించి నీరు బయటకు ప్రవహిస్తోంది.

పోగొండ రిజర్వాయర్‌

మొత్తం చెరువులు 128

100 ఎకరాలకు పైబడినవి 40

చిన్న చెరువులు 81

చెక్‌ డ్యామ్‌లు 48

ఆనకట్టలు 300

ప్రాజెక్టులు 3

ఎట్టకేలకు కురిసిన వర్షాలకు జలాశయాల్లో, చెరువుల్లో వరద నీరు వచ్చి చేరింది. రబీ పంటల సీజన్‌కు కొంతమేర నీరు ఉపయోగపడుతుంది. పోగొండ, జల్లేరుతోపాటు అన్ని చెరువులు, ప్రాజెక్టుల్లో కూడా వరద నీరు సమృద్ధిగా ఉంది.

– టి.సురేష్‌, మైనర్‌ ఇరిగేషన్‌ ఏఈఈ, కేఆర్‌పురం, బుట్టాయగూడెం మండలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement