● సాంకేతికతో ముంపు ముప్పు దూరం
● వరదలు రాకముందే హెచ్చరికలు
● జీపీఎం టెక్నాలజీతో పర్యవేక్షణ
కుక్కునూరు: గోదావరి వరద తీవ్రతను ఒకప్పుడు భద్రాచలం వద్ద నీటిమట్టం పెరిగిన తర్వాత, స్థానిక గేజ్ స్టేషన్లలో నమోదైన వివరాల ఆధారంగా మాత్రమే అంచనా వేసేవారు. దీనివల్ల ముంపు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయడానికి, సహాయక చర్యలు చేపట్టడానికి తగినంత సమయం దొరికేది కాదు. అయితే ప్రస్తుతం ఆధునిక సాంకేతికత అందుబాటులోకి రావడంతో వరద ముప్పును ముందే గుర్తించే వ్యవస్థ బలపడింది.
సాంకేతిక సమన్వయంతో ముందస్తు అంచనా
భారత వాతావరణ శాఖ, కేంద్ర జల సంఘం సంయుక్తంగా ఉపగ్రహ పరిశీలనలు, వర్షపాత అంచనాలు, నదీ ప్రవాహ నమూనాలను విశ్లేషిస్తూ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాయి. ముఖ్యంగా గ్లోబల్ ప్రెసిపిటేషన్ మెజర్‌మెంట్ (జీపీఎం) వంటి ఉపగ్రహ ఆధారిత వ్యవస్థల ద్వారా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలు, రాబోయే వర్ష సూచనలు, నదిలోకి చేరే నీటి పరిమాణాన్ని ముందుగానే గణించే వీలు కలుగుతోంది.
అప్రమత్తత.. ప్రయోజనాలు
● కేవలం భద్రాచలం వద్ద నీటిమట్టంపైనే ఆధారపడకుండా ఎగువ వర్షపాతం, నదీ ప్రవాహ వేగాన్ని పరిగణనలోకి తీసుకుని ముంపు ప్రాంతాలను ముందే గుర్తిస్తున్నారు.
● సోషల్ మీడియా, ఇతర సమాచార వ్యవస్థల ద్వారా అధికారులను, ప్రజలను సకాలంలో అప్రమత్తం చేస్తున్నారు.
● ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించేందుకు వీలుగా ముంపు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, సహాయక బృందాలను సిద్ధం చేయడం సాధ్యమవుతోంది.
గతంలో వరద వచ్చిన తర్వాత స్పందించే పరిస్థితి ఉండేది. అయితే నేడు ఉపగ్రహ సాంకేతికత, వాతావరణ అంచనాలు, గేజ్ స్టేషన్ల సమాచార సమన్వయంతో వరద రాకముందే అప్రమత్తమయ్యే స్థాయికి చేరుకున్నారు. ఈ ఆధునిక సాంకేతికతే గోదావరి తీర ప్రాంత ప్రజలకు నిజమైన రక్షణ కవచంగా నిలుస్తోంది.


