లక్డీకాపూల్ : రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్ డెడ్‌కు గురైన 18 ఏళ్ల విద్యార్థి అవయవాలను దానం చేసి, అతని కుటుంబ సభ్యులు ఆరుగురి ప్రాణాలను కాపాడడం ద్వారా మానవత్వాన్ని చాటుకున్నారు. పూర్వ పశ్చిమగోదావరి జిల్లా దేవరపల్లి పరిధిలోని రాజుల వీధికి చెందిన సిద్ధాని పోలయ్య కుమారుడు ప్రేమ వెంకట సత్య సాయి శ్రీనాథ్ (18) హైదరాబాద్‌లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఈ నెల 17న శ్రీనాథ్ కారు నడుపుతుండగా మరొక కారు బలంగా ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన శ్రీనాథ్‌ను కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స అందించినప్పటికీ పరిస్థితి విషమించి ఈ నెల 24న అతడు బ్రెయిన్ డెడ్ చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. తీవ్ర విషాదంలోనూ శ్రీనాథ్ తండ్రి పోలయ్య ధైర్యంతో శ్రీనాథ్ అవయవాలను దానం చేసేందుకు ముందుకు వచ్చారు. జీవన్‌దాన్ సంస్థ శ్రీనాథ్ శరీరం నుంచి రెండు కిడ్నీలు, కాలేయం, ఊపిరితిత్తులు, రెండు కార్నియాలను సేకరించి ఆరుగురు బాధితులకు అమర్చి పునర్జన్మ ప్రసాదించింది. ఈ ఏడాదిలో నమోదైన 152వ బ్రెయిన్‌డెడ్ అవయవ దానం ఇదేనని సంస్థ ఇన్‌చార్జి భూషణ్‌రాజ్ తెలిపారు.


