క్లీనర్ దుర్మరణం, 9 మందికి గాయాలు
భీమడోలు: జాతీయ రహదారిపై సూరప్పగూడెం పంచాయతీ శివారు పాతూరు షుగర్ ఫ్యాక్టరీ కల్వర్టు వద్ద శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన లారీ గుంతలో పడి అదుపుతప్పి బోల్తా పడటంతో పశ్చిమబెంగాల్‌కు చెందిన క్లీనర్ రంజిత్‌షా (51) అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనలో మరో నలుగురికి తీవ్ర గాయాలు కాగా, ఐదుగురికి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల 24న పశ్చిమబెంగాల్ నుంచి రెండు లక్షల చేప పిల్లలను ఉంగుటూరు మండలంలోని కై కరం, నారాయణపురం ప్రాంతాల్లో విక్రయించేందుకు ఓ లారీలో 10 మంది బయలుదేరారు. వీరిలో ఇద్దరు డ్రైవర్లు, ఒక క్లీనర్, ఏడుగురు కూలీలు ఉన్నారు. గుండుగొలను చేరుకుని తిరిగి నారాయణపురం వైపు వెళుతుండగా మార్గమధ్యలో పాతూరు కల్వర్టు వద్ద గుంతలో పడింది. అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టి బోల్తా కొట్టింది. ప్రమాదంలో క్లీనర్ మృతి చెందగా, కూలీలు అమిత్‌షిక్‌ధర్, సదన్ బిస్వాస్, సాగర్ బిస్వాస్, బీబస్ బిస్వాస్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. రెండో డ్రైవర్ మైనక్ భోమిక్, వంసాసత్ర, షమ్మిర సర్కార్, రంజిత్‌లకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ప్రమాదం కారణంగా లక్షల రూపాయల విలువైన చేప పిల్లలు రోడ్డుపాలయ్యాయి. సమాచారం అందుకున్న భీమడోలు సీఐ వి.కృష్ణ, ఎస్సై ఎస్‌కే మదీనా బాషాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్రేన్ సాయంతో లారీని తొలగించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. కూలీ వంసా సత్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


