నేలకొరిగిన ఉద్యాన పంటలు | - | Sakshi
Sakshi News home page

నేలకొరిగిన ఉద్యాన పంటలు

Sep 26 2026 12:44 AM | Updated on Sep 26 2026 12:44 AM

రూ. 4 లక్షలకు పైగా నష్టం

ఉంగుటూరు: ఏలూరు జిల్లాలో కురిసిన భారీ వర్షాలు, ఈదురుగాలుల ప్రభావంతో ఉద్యాన పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. చేతికొచ్చిన పంటలు కళ్లెదుటే నేలపాలు కావడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వేలాది రూపాయల పెట్టుబడి నష్టపోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని మెట్టప్రాంత మండలాలైన పెదవేగి, భీమడోలు, ఉంగుటూరు, డి. తిరుమల, కామవరపుకోట, లింగపాలెం, చింతలపూడి, జంగారెడ్డిగూడెం, టి. నర్సాపురం, చాట్రాయి, ముసునూరు, నూజివీడు, ఆగిరిపల్లి, కొయ్యలగూడెం తదితర ప్రాంతాల్లో రైతులు ఆరుతడి పంటలను ఎక్కువగా సాగు చేస్తుంటారు. ముఖ్యంగా పామాయిల్‌, కొబ్బరి, బొప్పాయితో పాటు కూరగాయలు పండిస్తారు. తాజా తుఫాను ప్రభావంతో ఈ పంటలకు అపార నష్టం వాటిల్లింది.

నష్టపోయిన రైతులు

ఉద్యాన శాఖ అధికారుల ప్రాథమిక అంచనా ప్రకారం జిల్లా వ్యాప్తంగా 35.44 హెక్టార్లలో చిక్కుడు, టమాటా, బీర, వంగ తదితర కూరగాయ పంటలు దెబ్బతినగా, 75 మంది రైతులు నష్టపోయారు. అలాగే 16 హెక్టార్లలో బొప్పాయి దెబ్బతినడంతో 15 మంది రైతులు నష్టపోయినట్లు గుర్తించారు. జిల్లాలో 50 కొబ్బరి చెట్లు, 268 ఆయిల్‌ పామ్‌ చెట్లు పడిపోవడంతో మరో వంద మందికి పైగా రైతులకు నష్టం వాటిల్లింది. జిల్లా హార్టికల్చర్‌ డీడీ కె.సాజా నాయక్‌ ఆధ్వర్యంలో నష్టాలను అంచనా వేస్తున్నారు. ఉంగుటూరు, ద్వారకాతిరుమల, భీమడోలు మండలాల్లో జరిగిన నష్టాన్ని ఉంగుటూరు ఉద్యాన శాఖ అధికారి పి.అమరనాథ్‌ పర్యవేక్షిస్తున్నారు.

ముసునూరులో అరటి రైతుల విలవిల

ముసునూరు: ఆరుగాలం శ్రమించి పండించిన అరటి పంటకు అకాల వర్షం, బలమైన ఈదురు గాలులు తోడవడంతో ముసునూరు మండల వ్యాప్తంగా పంట నేలకొరిగింది. ముసునూరుతో పాటు అక్కిరెడ్డిగూడెం, చెక్కపల్లి, చింతలవల్లి, కాట్రేనిపాడు గ్రామాల్లో టిష్యూ కల్చర్‌ విధానంలో రైతులు పచ్చ అరటిని విస్తృతంగా సాగు చేస్తున్నారు. ఎకరానికి రూ.1.30 లక్షలకు పైగా పెట్టుబడి పెట్టారు. గెలలు కోసి మార్కెట్‌కు తరలించే తరుణంలో అకాల వర్షాలు కుదేలు చేశాయి. మరో 15–20 రోజుల్లో దిగుబడికి రావాల్సిన వేలాది గెలలు నేలపాలు కావడంతో, కనీసం పెట్టుబడి కూడా దక్కే పరిస్థితి లేదని రైతులు కన్నీటిపర్యంతమవుతున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ నష్టాలపై మండల ఉద్యాన శాఖ అధికారిణి జ్యోతి ప్రియాంక స్పందిస్తూ ముసునూరు, అక్కిరెడ్డిగూడెం తదితర గ్రామాల్లో నేలకొరిగిన పంటల వివరాలు సేకరించి, ఉన్నతాధికారులకు నివేదిక పంపుతామని, ఆ తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని వివరణ ఇచ్చారు.

ఎకరానికి రూ.1.30 లక్షల చొప్పున ఏడు ఎకరాల్లో సుమారు రూ. 10 లక్షలు ఖర్చుపెట్టి పచ్చ అరటి సాగు చేశాను. గురువారం రాత్రి వీచిన గాలులకు మూడు ఎకరాల్లో సుమారు నాలుగు వేల గెలలు పడిపోయాయి. దీని వల్ల రూ. 4 లక్షలకు పైగా నష్టం వాటిల్లింది. ఉద్యాన శాఖ అధికారులు స్పందించి మాలాంటి రైతులను ఆదుకోవాలి.

– రేగుల గోపాలకృష్ణ, అరటి రైతు, ముసునూరు

గోపాలపురంలో పడిపోయిన బొప్పాయి తోట

ముసునూరులో నేలకొరిగిన అరటి పంట

పెట్టుబడులు నష్టపోయామని రైతుల ఆవేదన

ముసునూరులో తీవ్రంగా దెబ్బతిన్న అరటి తోటలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement