ఇనుప రాడ్డుతో దాడి
అప్పు తీర్చలేక ఉపాధ్యాయుడిని మట్టుబెట్టే యత్నం
భీమవరం: కాళ్ల మండలం పెదఅమిరం గ్రామంలో ఉపాధ్యాయుడిపై జరిగిన హత్యాయత్నం కేసులో నిందితులను అరెస్ట్ చేసినట్లు జిల్లా అడిషనల్ ఎస్పీ డి.విశ్వనాథ్ తెలిపారు. శుక్రవారం భీమవరం డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. పెదఅమిరం పంచాయతీ నెహ్రూపేటకు చెందిన చోడాబత్తుల వెంకటరత్నం ఉండి మండలం ఎన్‌ఆర్‌పీ అగ్రహారం జెడ్పీ హైస్కూల్లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. కాళ్ల మండలం బొండాడ గ్రామానికి చెందిన మందపాటి కృష్ణమూర్తికి వెంకటరత్నం గతంలో రూ. 45 లక్షలు అప్పుగా ఇచ్చారు. అప్పు తీర్చలేకపోవడంతో రెండేళ్ల క్రితం మరో రూ. 20 లక్షలు చెల్లించి కృష్ణమూర్తికి చెందిన 14 సెంట్ల స్థలం, ఇంటిని వెంకటరత్నం భార్య ఉమామహేశ్వరి పేరున రిజిస్టర్ చేయించుకున్నారు. అయితే కృష్ణమూర్తి కుటుంబ సభ్యులు ఇంటిని ఖాళీ చేయలేదు. దీనిపై పెద్దల సమక్షంలో పంచాయతీలు జరిగినా సమస్య పరిష్కారం కాలేదు.
రూ.5 లక్షలకు డీల్
ఈ నెల 19న మరోసారి పంచాయతీ జరగగా, మొత్తం సొమ్ము చెల్లిస్తానని కృష్ణమూర్తి ఒప్పందం చేసుకున్నాడు. ముందుగా రూ. 20 లక్షల చెక్ ఇచ్చి, మిగిలిన మొత్తాన్ని వారంలో ఇస్తానని ఒప్పుకున్నాడు. అయితే ఆ చెక్ బౌన్స్ కావడంతో ఇల్లు వెంటనే అప్పగించాలని వెంకటరత్నం డిమాండ్ చేశాడు. దీంతో కృష్ణమూర్తి ఆయన్ను హత్య చేయించాలని పథకం పన్నాడు. బొండాడకు చెందిన మందపాటి సుధీర్, మందపాటి ప్రవీణ్, బొండాడ లంకకు చెందిన పొన్నాల స్వామి, పొన్నాల పర్రాజులతో పాటు మరో మైనర్‌కు రూ. 5 లక్షలు ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకుని అడ్వాన్స్‌గా రూ. 30 వేలు చెల్లించాడు.
ఈ నెల 21న పెదఅమిరంలో సైకిల్‌పై వెళుతున్న వెంకటరత్నంపై నిందితులు దాడి చేసి, ఇనుప రాడ్డుతో తలపై బలంగా కొట్టారు. బాధితుడు ప్రతిఘటించడంతో వారు అక్కడి నుంచి పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదు మేరకు భీమవరం ఇన్‌చార్జి డీఎస్పీ ఎం.సుధాకరరావు పర్యవేక్షణలో పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి సాంకేతిక పరిజ్ఞానంతో నిందితులను శుక్రవారం బొండాడలోని డంపింగ్ యార్డు వద్ద అరెస్టు చేశారు. వారి నుంచి ఐదు సెల్‌ఫోన్లు, మోటార్‌సైకిల్, ఇనుప రాడ్డును స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులను అడిషనల్ ఎస్పీ, డీఎస్పీలు అభినందించి రివార్డులు అందించారు.


