పోలవరంలో అత్యధికం
జిల్లాలో వర్షం ముంచెత్తుతోంది. తీవ్ర వాయుగుండం ప్రభావంతో 48 గంటలుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఏజెన్సీతో సహా కొన్ని ప్రాంతాల్లో కల్వర్టులపై నీరుచేరి రహదారుల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో జిల్లాలో శుక్రవారం కూడా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. గురువారం రాత్రి 7 గంటల సమయానికి జిల్లాలో 1,126 మి.మీటర్ల వర్షపాతం నమోదైంది. గతేడాదిలో ఈ స్థాయి వర్షపాతం జిల్లాలో నమోదు కాలేదు.
సాక్షి ప్రతినిధి,ఏలూరు: జిల్లాలోని 27 మండలాల్లో ఉదయం నుంచి జల్లులు కురుస్తూనే ఉన్నాయి. ఏజెన్సీలోని గుబ్బల మంగమ్మ తల్లి దేవస్థానంలో దర్శనాలు నిలిపివేశారు. వాగులు పొంగుతున్న క్రమంలో ఆ మార్గంలో రాకపోకలు నిషేధించారు.
రోడ్డెక్కిన నీరు
ఏలూరులోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపై వర్షం నీరు నిలిచిపోయింది. ఏలూరులోని అగ్రహారం, వన్‌టౌన్ ప్రాంతాల్లో రోడ్లపై నీరు చేరింది. ఏలూరులో 43.8 మి.మీటర్ల వర్షపాతం నమోదైంది. మరోవైపు కొల్లేరుకు వరద నీరు ఉధృతంగా చేరుతుంది. కామవరపుకోటలో పంట పొలాలను కలెక్టర్ పరిశీలించారు.
మరో 24 గంటల పాటు..
మరో 24 గంటల పాటు వర్షాలు కురుస్తాయని అధికారులు ప్రకటించారు. ప్రధానంగా తమ్మిలేరు, బుడమేరు, ఇతర వాగులు పొంగిపొర్లే ప్రాంతాల్లో బారీకేడ్లు ఏర్పాటు చేయాలని, అలాగే కాజ్‌వేపై రాకపోకలు లేకుండా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. డ్రెయిన్లలో నీటి ప్రవాహనికి అడ్డంకులు లేకుండా చర్యలు తీసుకోవడంతో పాటు విద్యుత్ సరఫరా యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు.
ఉధృతంగా కొండ వాగులు
బుట్టాయగూడెం: ఏజెన్సీ ప్రాంతంలోని కొండవాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది.బుట్టాయగూడెం మండలం రేగులపాడు, రామచంద్రాపురం సమీపంలోని కల్వర్టు కొట్టుకుపోయి ఇటుగా రాకపోకలు నిలిచిపోయాయి. కొండ్లపై నుంచి కురుస్తున్న వర్షానికి గుబ్బల మంగమ్మతల్లి జల్లేరు జలాశయంలోకి భారీ నీరు వచ్చి చేరుతుంది. జలాశయం పూర్తి నీటి సామర్థ్యం 217.80 కాగా ప్రస్తుతం నీటిసామర్థ్యం 213 మీటర్లు ఉన్నట్టు ఇరిగేషన్ ఏఈ పి.సురేష్ తెలిపారు. అలాగే 556 క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లో ఉందన్నారు. పోగొండ రిజర్వాయర్ 157 మీటర్లు పూర్తి నీటిమట్టం దాటి నీరు బయటకు ప్రవహిస్తుంది. రిజర్వాయర్‌కు 1300 క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లో ఉంది. కొవ్వాడ ప్రాజెక్టులో 83 మీటర్ల నీటిమట్టం ఉండగా 368 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. పులిరామన్నగూడెం తూర్పుకాల్వ, చింతకొండ, దాటుకాల్వతోపాటు పలు కొండ వాగులు పొంగిపొర్లుతున్నాయి.
ఆలయ ఈఓలకు ఆదేశాలు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): దేవస్థానాల వద్ద ఈఓలు తక్షణమే అప్రమత్తమై ముందస్తు భద్రతా చర్యలు చేపట్టాలని జిల్లా దేవాదాయశాఖ అధికారి కూ చిపూడి శ్రీనివాస్ ఆదేశించారు. దేవస్థాన ప్రాంగ ణంలో ఎక్కడా వర్షం నీరు నిల్వ ఉండకుండా చూడాలని, ధ్వజస్తంభాల వద్ద తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కాకుండా చూడాలని, ప్రహరీలు, పైకప్పులు, గోడలు, షెడ్లు, ప్రాకారాల వద్ద పరిస్థితిని సమీక్షించాలన్నారు.
జిల్లాలో అత్యధిక వర్షపాతం పోలవరం మండలంలో 69 మి.మీ కాగా.. నిడమర్రులో 4.6 మిల్లీ మీటర్లతో అత్యల్ప వర్షపాతం నమోదైంది. మండలాల వారీగా నూజివీడులో 66.4, వేలేరుపాడులో 64.6, ముసునూరులో 55.8, పెదపాడులో 51, కుక్కునూరులో 49.6, బుట్టాయగూడెంలో 47.8, ముదినేపల్లిలో 43.8, ఏలూరు అర్బన్ పరిధిలో 41.2, ఏలూరు రూరల్ పరిధిలో 39.8 మి.మీ వర్షం కురిసింది. కామవరపుకోటలో 39.2, చాట్రాయిలో 37.8, కై కలూరులో 36.6, మండవల్లిలో 36.6, కొయ్యలగూడెంలో 35.8, కొయ్యలగూడెంలో 35.8, దెందులూరులో 33.8, కలిదిండిలో 33.6, ద్వారకాతిరుమలలో 32.6, ఆగిరిపల్లిలో 31.4, జీలుగుమిల్లిలో 31.4, టి.నర్సాపురంలో 30.4, లింగపాలెంలో 27.2, పెదవేగిలో 24, జంగారెడ్డిగూడెంలో 23.2, ఉంగుటూరులో 22.2, భీమడోలులో 20.6, చింతలపూడిలో 13.4 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.
ఎడతెగని వాన
ఏజెన్సీలో ఉధృతంగా ప్రవహిస్తున్న కొండవాగులు
నీటి ప్రవాహంతో కొట్టుకుపోయిన కల్వర్టులు
లోతట్టు ప్రాంతాలు జలమయం
జిల్లాలో 1,126 మి.మీ. వర్షపాతం
నేడూ పాఠశాలలకు సెలవు


