రెడ్‌క్రాస్‌కు భారీ విరాళం | - | Sakshi
Sakshi News home page

రెడ్‌క్రాస్‌కు భారీ విరాళం

Sep 25 2026 1:29 AM | Updated on Sep 25 2026 1:29 AM

రెడ్‌క్రాస్‌కు భారీ విరాళం గోదావరిలో వరద ప్రవాహం నేడు పాఠశాలలకు సెలవు 1న మధ్యాహ్నం పింఛన్‌ పంపిణీ ఎర్రకాలువ ప్రాజెక్టుకు వరదనీరు ట్యాంకర్‌ నుంచి పామాయిల్‌ పక్కదారి?

దెందులూరు: జిల్లా రెడ్‌ క్రాస్‌ సంస్థకు కొవ్వలి షాలేము వృద్ధాశ్రమం వ్యవస్థాపకులు బూసి ఏసోబు, ప్రభావతి దంపతులు వారి కుమారులు ఎఫ్రాఏం ఎఫ్తా రూత్‌ రూ.50 లక్షల విరాళం అందజేశారు. గురువారం ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి దాతలను అభినందించి సత్కరించారు. రెడ్‌క్రాస్‌ సంస్థ సేవా కార్యక్రమాల్లో భాగంగా వర్కింగ్‌ ఉమెన్స్‌ శిక్షణ పొందుతున్న యువతుల కోసం హాస్టల్‌ నిర్మాణాన్ని ప్రారంభించారు.

పోలవరం రూరల్‌: గోదావరి పరీవాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు నదిలోకి నీరు చేరుతుండటంతో వరద ప్రవాహం పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల్లో ఉప నదుల నీటికి తోడు శబరి నీరు కూడా పెరుగుతుండటంతో ఉధృతి గంట గంటకూ పెరుగుతోంది. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే వద్ద 29 మీటర్లకు నీటిమట్టం చేరుకుంది. స్పిల్‌వే 48 గేట్ల నుంచి దిగువకు 2.47 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు చేరుతోంది. దిగువన ఇసుక తిన్నెలను ముంచుకుంటూ ప్రవహిస్తోంది. మరో రెండు రోజులపాటు వరద ఉధృతి పెరిగే అవకాశం ఉందని అధికార యంత్రాంగం అంచనా వేస్తోంది.

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల దృష్ట్యా అన్ని యాజమాన్యాలు, అన్ని కేటగిరీల విద్యాసంస్థలకు శుక్రవారం పరిహార సెలవు ప్రకటించినట్టు డీఈఓ ఎం.వెంకటలక్ష్మమ్మ తెలిపారు. అలాగే షెడ్యూల్‌ ప్రకారం జరగాల్సిన డీ వార్మింగ్‌ డేను ఈనెల 28న (సోమవారం) నిర్వహించాలని ఆదేశించారు. ఈ మేరకు క్షేత్రస్థాయి సిబ్బంది ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.

ఏలూరు (టూటౌన్‌): జిల్లాలో ఎన్టీఆర్‌ భరోసా పింఛన్‌ పంపిణీ వచ్చేనెల 1న మధ్యాహ్నం నుంచి ప్రారంభమవుతుందని కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి తెలిపారు. గురువారం జూమ్‌ కాన్ఫ రెన్స్‌ ద్వారా ఆమె సమీక్షించారు. జాతీయ బ్యాంకు ఉద్యోగులు ఈనెల 28 నుంచి 30 వరకు సమ్మె కారణంగా 1న పింఛన్ల సొమ్ము విత్‌డ్రా చేసి అదేరోజు మధ్యాహ్నం నుంచి పంపిణీ చేస్తామన్నారు. భారీ వర్షాల దృష్ట్యా శుక్రవారం దెందులూరు ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించాల్సిన ఒక నెల, ఒక నియోజకవర్గం కార్యక్రమాన్ని రద్దు చేశామన్నారు.

జంగారెడ్డిగూడెం (చింతలపూడి): భారీ వర్షాలతో కేకేఎం ఎర్ర కాలువ ప్రాజెక్ట్‌కు వరద నీరు పెరుగుతోందని ఇరిగేషన్‌ జేఈఈ అనిల్‌కుమార్‌ తెలిపారు. వర్షాలకు ముందు ప్రాజెక్ట్‌ నీటిమట్టం 77.8 మీటర్లుగా ఉండగా ప్రస్తుతం 78.3 మీటర్లకు నీరు చేరిందన్నారు. వర్షాల వల్ల ప్రాజెక్ట్‌లో సుమారు 0.2 టీఎంసీల మేర నీటి నిల్వ పెరిగిందని, ప్రస్తుతం జలాశయంలోకి 300 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోందని వివరించారు. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతున్నందున ప్రాజెక్ట్‌ నీటిమట్టాన్ని, ఇన్‌ఫ్లో ప్రవాహాన్ని నీటిపారుదల శాఖ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని పేర్కొన్నారు.

ఖమ్మం అర్బన్‌: ఏలూరు జిల్లా చింతలపూడి మండలం సీతానగరం వద్ద ఉన్న ఆయిల్‌పామ్‌ ఫ్యాక్టరీ నుంచి హైదరాబాద్‌కు ట్యాంకర్ల ద్వా రా తరలించే పామాయిల్‌ను తీసి, ఇతర నూ నెలు కలుపుతున్నారనే ఆరోపణలు కలకలం రేపాయి. తెలంగాణలోని ఖమ్మం శివారులో దాబా వద్ద ట్యాంకర్‌ను ఆపిన సమయాన ఆటోలో క్యాన్లతో వచ్చిన పలువురు నూనె తీస్తుండగా బుధవారం రాత్రి ఖమ్మం అర్బన్‌ పోలీసులు పట్టుకున్నట్లు సమాచారం. ట్యాంకర్‌లోని పామాయిల్‌ తీసి, అనుమానం రాకుండా హోటళ్లలో వాడిన వంట నూనెతో పాటు ఇంజన్‌ ఆయిల్‌ కలుపుతున్నారని తెలిసింది. అయితే ఈ విషయమై కేసు నమోదు చేసినా వివరాలు విచారణ అనంతరం వెల్లడిస్తామని ఖమ్మం అర్బన్‌ సీఐ భానుప్రకాశ్‌ పేర్కొన్నారు. ట్యాంకర్‌, ఆటోతో పాటు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఒక్కో ట్యాంకర్‌ నుంచి సుమారు వేయి లీటర్ల వరకు పామాయిల్‌ తీసి ఇతర నూనెలు కలుపుతున్నట్టు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement