జంగారెడ్డిగూడెం (చింతలపూడి): జంగారెడ్డిగూడెం సబ్ ట్రెజరీ (ఉప ఖజానా) కార్యాలయంలో ఏసీబీ అధికారులు గురువారం సోదాలు చేశారు. ఏసీబీ డీఎస్పీ జీవీ కృష్ణారావు ఆధ్వర్యంలో అధికారులు రికార్డులను పరిశీలించారు. ఇటీవల మరణించిన తన తల్లి పెన్షన్ సొమ్మును తన పేరిట బదిలీ చేసేందుకు సబ్ ట్రెజరీ కార్యాలయానికి చెందిన సిబ్బంది లంచం డిమాండ్ చేశారని ఓ బాధితురాలు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఈ ఫిర్యాదు ఆధారంగా రంగంలోకి దిగిన అధికారులు తనిఖీలు చేపట్టి సుదీర్ఘంగా విచారణ జరిపారు. కార్యాలయంలోని ఏటీఓ చంద్రయ్య, ఎస్టీఓ చినబాబులతో పాటు కార్యాలయంలో ఉన్న మరో వ్యక్తి నుంచి ఏసీబీ అధికారులు స్టేట్‌మెంట్లు రికార్డు చేసుకున్నారు. సోదాలు, విచారణ వివరాలపై అధికారులు గోప్యత పాటిస్తున్నారు. ఏసీబీ సీఐలు ఎం.బాలకృష్ణ, కె.శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు.


