బుట్టాయగూడెం: ఏజెన్సీ ప్రాంతంలో శనివారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. ఉదయం నుంచి మబ్బుగా ఉన్నా సాయంత్ర సమయానికి ఒక్కసారిగా బలమైన ఈదురుగాలులు వీచి గంట సేపు వర్షం కరిసింది. వీచిన గాలికి పలుచోట్ల చెట్టుకొమ్మలు విరిగిపడి రోడ్లకు అడ్డంగా పడ్డాయి. అలాగే విద్యుత్ వైర్లపై కూడా చెట్ల కొమ్మలు పడటంతో సుమారు గంటన్నర వరకూ విద్యుత్ అంతరా యం కలిగింది. విద్యుత్‌శాఖ సిబ్బంది చెట్ల కొ మ్మలను తొలగించి సాయంత్రం 6 గంటల సమయానికి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. అలాగే మర్లగూడెం సమీపంలోని పాట్మెమ్మగుడి వద్ద చెట్ల కొమ్మలు రహదారికి అడ్డంగా పడడంతో వాహనాల రాకపోకలకు కొద్దిసేపు అంతరాయం కలిగింది. స్థానికులు, అధికారులు కొమ్మలను తొలగించడంతో సమస్య తీరింది. అలాగే శనివారం బుట్టాయగూడెం వారాంతపు సంత కావడంతో కురిసిన వర్షానికి వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ముదినేపల్లి, మండవల్లిలో..
ముదినేపల్లి రూరల్/మండవల్లి: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ప్రభావంతో ముదినేపల్లి, మండవల్లి మండలాల్లో శనివారం భారీ వర్షం కురిసింది. దీంతో పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎల్‌నినో ప్రభావంతో ఇప్పటివరకూ సరైన వానలు కురవకపోవడంతో నిరాశ చెందిన రైతులకు ఈ వర్షం ఊరట నిచ్చింది. ప్రస్తుతం పొలాలు ఈనిక దశలో ఉన్నాయని, వర్షం మేలు చేస్తుందని అంటు న్నారు. ముదినేపల్లి మండలంలోని పెయ్యేరు, శ్రీహరిపురం, సింగరాయపాలెం, అన్నవరం, కాకరవాడ కాలనీల్లోని రోడ్లపై నీరు నిలిచిపోయింది.
కై కలూరులో..
కై కలూరు: కై కలూరులో వర్షం దంచికొట్టింది. దీంతో డ్రెయిన్లు పొంగిపొర్లయి. బస్టాండ్, వెలంపేట, టౌన్‌హాలు ప్రాంతాల్లోకి వర్షం నీరు చేరింది. చవితి పందిళ్ల ఏర్పాట్లకు అంతరాయం కలిగింది.


