● జెడ్పీటీసీలకు ముగుస్తున్న పదవీ కాలం
● 36 నెలల గౌరవ వేతనం బకాయి
● జిల్లాలో రూ.1.03 కోట్ల మేర బిల్లుల పెండింగ్
దెందులూరు: పదవీకాలం ముగుస్తున్న చివరి రోజుల్లో కూడా తమకు దక్కాల్సిన గౌరవ వేతనం అందకపోవడంపై జిల్లాలోని పలువురు జెడ్పీటీసీ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెలకు రూ.6 వేల చొప్పున 37 నెలలకు ఒక్కో సభ్యుడికి రూ.2.16 లక్షలు రావాల్సి ఉందని అంటున్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని మొత్తం 48 మంది సభ్యులకు రూ.1.03 కోట్ల బకాయి వేతనాలు విడుదల కావాల్సి ఉందని చెబుతున్నారు.
30తో ముగియనున్న పదవీ కాలం
జిల్లాలోని 48 మండలాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న 48 మంది జెడ్పీటీసీల పదవీకాలం 2026 సెప్టెంబర్ 30తో ముగియనుంది. గౌరవ వేతన బిల్లుల మంజూరు కోసం జిల్లాపరిషత్ అధికారులు రెండు, మూడు సార్లు నివేదికలు పంపినా ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంపై సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉంటూ గ్రామాల్లోని సమస్యలను జెడ్పీటీసీ సర్వసభ్య సమావేశాల్లో మంత్రులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తున్న తమ పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరైంది కాదని మండిపడుతున్నారు. జిల్లాలో అభివృద్ధి పనులకు నిధులు కేటాయిస్తున్న ప్రభుత్వం ప్రజాప్రతినిధుల గౌరవవేతనం బిల్లులను ఎందుకు పెండింగ్‌లో పెడుతోందో సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
జెడ్పీటీసీ సభ్యుల పదవీ కాలం త్వరలో ముగియనుంది. ఈలోపు తమకు రావాల్సిన మొత్తం బకాయి వేతనాలు చెల్లించాలి. ప్రజాప్రతినిధులు అంతా వేతనాలు అందుతాయో.. లేదో అనే మీమాంసలో ఉన్నారు. – రమేష్, కామవరపుకోట జెడ్పీటీసీ
జిల్లాలోని జెడ్పీటీసీ సభ్యులందరికీ పెండింగ్ ఉన్న గౌరవ వేతన బకాయిలు పూర్తిగా చెల్లించాలి. గౌరవంగా పదవీ విరమణలోపు బిల్లులు చెల్లింపు ప్రక్రియ జరిగేలా అన్నిస్థాయిల ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాలి. – మండల సరస్వతి, ఏలూరు జెడ్పీటీసీ


