ద్వారకాతిరుమల: భక్తుల గోవింద నామస్మరణలు.. కోలాట ప్రదర్శనలతో చినవెంకన్న దివ్యక్షేత్రం శనివారం మార్మోగింది. శ్రీవారికి ప్రీతికరమైన రోజు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు క్షేత్రానికి తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. గోవింద నామస్మరణలు చేస్తూ భక్తులు స్వామివారిని దర్శించి పులకించిపోయారు. సాయంత్రం వరకు ఆలయంలోని అన్ని విభాగాల్లో భక్తుల రద్దీ కొనసాగింది. మరోవైపు అనివేటి మండపాల్లో వివిధ భజన మండళ్ల సభ్యులు నిర్వహించిన కోలాట ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. లయబద్ధంగా సాగిన కోలాట నృత్యాలను భక్తులు ఆసక్తిగా తిలకించారు. ముఖ్యంగా చిన్నారుల కోలాట ప్రదర్శనలు చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి.


