ఏలూరు టౌన్: వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగులు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి పటిష్టమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం (ఏపీజీఈఏ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. రమేష్‌కుమార్ తెలిపారు. ఏలూరులోని ఏపీజీఈఏ సంఘ కార్యాలయంలో ఉమ్మడి తూర్పు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నాయకుల సమావేశం నిర్వహించారు. వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించే ఈ సన్నాహక సమావేశానికి ఏలూరు జిల్లా సహ అధ్యక్షుడు గోవిందరావు అధ్యక్షత వహించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్‌కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజ్‌కుమార్ మాట్లాడుతూ... వైద్య ఆరోగ్యశాఖలో గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకూ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై విస్తృతంగా చర్చించామని తెలిపారు. ఉద్యోగులపై పెరుగుతున్న పని ఒత్తిడి, ఎఫ్‌ఆర్‌ఎస్ విధానం, వివిధ యాప్‌ల నిర్వహణతో అదనపు పనిభారం, సిబ్బంది కొరత, పరిపాలనా సమస్యలపై లోతుగా చర్చించి కార్యాచరణ రూపొందించాలని చెప్పారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ నాయకత్వంలో త్వరలోనే వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగులతో రాష్ట్రస్థాయిలో భారీ ప్రాంతీయ సమావేశాన్ని నిర్వహించాలని ఈ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించామన్నారు. వైద్య ఆరోగ్యశాఖకు శాపంగా మారిన జీవో నెం. 143ని తక్షణమే రద్దు చేయాలని, సచివాలయ ఏఎన్‌ఎంలను వైద్య ఆరోగ్యశాఖలో విలీనం చేయాలని సమావేశంలో నేతలు కోరారు. ఈ సమావేశంలో తూర్పుగోదావరి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల ఏపీజీఈఏ జిల్లా నాయకులు, వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.


