ఆకివీడు: స్థానిక ఉప్పుటేరు వంతెన సమీపంలోని మందపాడు రోడ్డులో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. సుమారు 40 నుంచి 45 సంవత్సరాల వయసున్న ఈ మహిళను గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసి, ఉప్పుటేరు గట్టున పడేసి ఉంటారని భావిస్తున్నారు. వివస్త్రగా ఉన్న ఆమె ఒంటిపై గాయాలున్నాయి. ముఖం కందిపోయి ఉండగా, మృతదేహం వద్ద దుప్పటి ఉన్నట్లు గుర్తించారు. హత్య చేసిన తర్వాత మృతదేహాన్ని దుప్పట్లో చుట్టి తీసుకువచ్చి పడేసి ఉంటారని అనుమానిస్తున్నారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఆ ప్రాంతానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. భీమవరం డీఎస్పీ రఘువీర్ విష్ణు, ఆకివీడు సీఐ కాళీచరణ్, ఎస్సై శుభశేఖర్ ఘటనా స్థలాన్ని పరిశీలించి, క్లూస్ టీమ్‌ను రంగంలోకి దింపారు. ఆ ప్రాంతాన్ని పరిశీలించిన అనంతరం డాగ్ స్క్వాడ్‌లోని జాగిలం ఒక చెరువు గట్టు వద్దకు వెళ్లి ఆగినట్లు తెలిసింది. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు. సీఐ ఆధ్వర్యంలో ఎస్సై శుభశేఖర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై డీఎస్పీ విష్ణు మాట్లాడుతూ.. కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి దోషులను పట్టుకుంటామని చెప్పారు. మృతదేహానికి సంబంధించిన వివరాలు తెలిసిన వారు స్థానిక పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని సూచించారు.


