మిట్టగూడెంలో యథేచ్ఛగా గ్రావెల్‌ తవ్వకాలు | - | Sakshi
Sakshi News home page

మిట్టగూడెంలో యథేచ్ఛగా గ్రావెల్‌ తవ్వకాలు

Aug 16 2026 2:03 AM | Updated on Aug 16 2026 2:03 AM

అడ్డుకున్న వైఎస్సార్‌సీపీ నేతలు, గ్రామస్తులు

అడ్డుకున్న వైఎస్సార్‌సీపీ నేతలు, గ్రామస్తులు

నూజివీడు: కూటమి ప్రభుత్వ పాలనలో అనుమతులు లేని గ్రావెల్‌, మట్టి తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. నూజివీడు మండలం మిట్టగూడెం రెవెన్యూ పరిధిలోని అన్నేరావుపేట రోడ్డులో ఓ గుట్ట నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా గ్రావెల్‌ తవ్వి తరలించేందుకు యత్నించగా, వైఎస్సార్‌సీపీ నాయకులు, గ్రామస్తులు శుక్రవారం అర్ధరాత్రి అడ్డుకున్నారు. స్థానికుల కథనం ప్రకారం.. నూజివీడు పట్టణానికి చెందిన ఓ టీడీపీ నాయకుడు పొక్లెయిన్‌, ఐదు టిప్పర్లతో గ్రావెల్‌ తరలించేందుకు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న మిట్టగూడెం సర్పంచి వెలివల నాగేశ్వరరావు, నాగా పద్మారావు, పోలగాని అయ్యప్ప, నల్లిబోయిన శంకర్‌తో పాటు దాదాపు 30 మంది గ్రామస్తులు సంఘటన స్థలానికి చేరుకుని తవ్వకాలను నిలిపివేశారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. తమ వద్ద ఏఎంఆర్‌ బిల్లులు ఉన్నాయని, అడ్డుకోవడానికి మీరెవరు అంటూ సదరు నాయకుడు వాదించారు. అయితే మైనింగ్‌ అనుమతి పత్రాలు చూపితేనే గ్రావెల్‌ తరలనిస్తామని గ్రామస్తులు స్పష్టం చేయడంతో, చేసేది లేక వారు పొక్లయిన్‌, టిప్పర్లతో వెనుదిరిగారు. ఈ ప్రాంతంలో గత ఏడాది కాలంగా రాత్రి వేళల్లో అక్రమ తవ్వకాలు సాగుతున్నాయని, గతంలో హనుమంతులగూడెం గ్రామస్తులు సైతం లారీలను నిలిపివేసినా అక్రమ రవాణా ఆగడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ట్రాక్టర్‌కు రూ.700 వసూలు చేస్తున్న ఏఎంఆర్‌ సంస్థ

గ్రామస్తులు ఇళ్ల నిర్మాణాలు, మెరక కోసం పునాదుల్లో మట్టి తోలుకుంటున్నా ఏఎంఆర్‌ సంస్థ ఉద్యోగులు వచ్చి ట్రాక్టర్‌కు రూ.700 వసూలు చేస్తున్నారని గ్రామస్తులు వాపోయారు. వాణిజ్య అవసరాలకు కాకుండా సొంత అవసరాలకే మట్టి తోలుకుంటున్నప్పటికీ ఇంత పెద్ద ఎత్తున వసూలు చేయడం దారుణమని వారు మండిపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement