గేటు పడిందా.. ప్రయాణం గోవిందా! | - | Sakshi
Sakshi News home page

గేటు పడిందా.. ప్రయాణం గోవిందా!

Aug 16 2026 2:03 AM | Updated on Aug 16 2026 2:03 AM

సమయం వృథా

ప్రతి పావు గంటకూ గేటు

అండర్‌ బ్రిడ్జిలు, ఫ్లైఓవర్లు ఎప్పటికి పూర్తయ్యేనో?

పట్టించుకోని ప్రజాప్రతినిధులు, రైల్వే అధికారులు

ఆకివీడు: విజయవాడ–నరసాపురం బ్రాంచి రైల్వే లైన్‌ డబ్లింగ్‌, విద్యుద్దీకరణ పూర్తయ్యాక రైళ్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రయాణం సుఖవంతమైనప్పటికీ, కొత్త రైళ్లతో పాటు ప్రతి పావుగంటకూ గూడ్స్‌ రైళ్లు రాకపోకలు సాగిస్తుండటంతో స్థానిక రైల్వే గేట్ల వద్ద ప్రజల నరకయాతన వర్ణనాతీతంగా మారింది.

గేట్లతో పెరుగుతున్న ఇక్కట్లు

ఒకేసారి రెండుమూడు రైళ్ల కోసం పావుగంటకు పైగా గేట్లు వేస్తుండటంతో, ఎండల్లోనూ వానల్లోనూ ప్రజలు వేచి చూడాల్సి వస్తోంది. పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు తీవ్ర మానసిక, ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు.

పడిపోయిన ఆస్తుల విలువలు

రైల్వే గేట్లకు ఆవల ఉన్న ప్రాంతాల్లో భూముల విలువలు లక్షల్లో పడిపోయాయి. కొనుగోలుదారులు ముందుకు రాకపోగా, ఉన్న గృహాలకు అద్దెదారులు దొరక్క టూలెట్‌ బోర్డులు వెలుస్తున్నాయి.

నిర్మాణాల్లో తీవ్ర జాప్యం

ఆకివీడు జవహర్‌పేట, సిద్ధాపురం, గుమ్ములూరు, దుంపగడప, శృంగవృక్షం, వీరవాసరం, పాలకొల్లు తదితర ప్రాంతాల్లో గేట్ల సమస్య తీవ్రంగా ఉంది. కొన్నిచోట్ల ఫ్లైఓవర్లు, అండర్‌ బ్రిడ్జీల నిర్మాణానికి అనుమతులు, టెండర్లు పూర్తయినా పనులు ప్రారంభం కాలేదు. ఉండి వద్ద నిర్మిస్తున్న ఫ్లైఓవర్‌ పనులు ఏళ్ల తరబడి సాగుతూనే ఉన్నాయి.

ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం

అధికారులు కొలతలతోనే సరిపెడుతున్నారని, స్థానిక ఎంపీలు, ఎమ్మెల్యేలు తగిన చొరవ చూపడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. రైల్వే బడ్జెట్‌లు సూపర్‌ ఎక్స్‌ప్రెస్‌లా దూసుకుపోతున్నా, గేట్ల ఇక్కట్లకు పరిష్కారం దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా రైల్వే శాఖ, ప్రజాప్రతినిధులు స్పందించి వంతెనల నిర్మాణాలను వేగవంతం చేయాలని కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement