వివాదాస్పదంగా జాతీయ పతాకావిష్కరణ | - | Sakshi
Sakshi News home page

వివాదాస్పదంగా జాతీయ పతాకావిష్కరణ

Aug 16 2026 2:03 AM | Updated on Aug 16 2026 2:03 AM

టీడీపీ నాయకుడితో పతాకావిష్కరణ చేయించిన తహసీల్దార్‌

జెండా పూర్తిగా ఎగరకముందే జాతీయ గీతం ఆలాపన

కుక్కునూరు: కుక్కునూరు తహసీల్దార్‌ కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించిన జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమం వివాదాస్పదమైంది. ప్రభుత్వ కార్యాలయంలో నిర్వహించిన అధికారిక కార్యక్రమంలో తహసీల్దార్‌ ప్రోటోకాల్‌కు విరుద్ధంగా వ్యవహరించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. శనివారం తహసీల్దార్‌ కార్యాలయంలో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో తహసీల్దార్‌ చలపతిరావు.. మండల కూటమి నాయకుడు వచ్చే వరకు పతాకావిష్కరణ చేయకుండా వేచి ఉండటంతోపాటు, ఆ నాయకుడితో జాతీయ జెండాను ఎగరవేయించడం మండల వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రభుత్వ కార్యాలయంలో జరిగే జాతీయ కార్యక్రమాన్ని రాజకీయ వేదికగా మార్చారంటూ పలువురు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

జెండా ఎగరకముందే జాతీయగీతం?

ఇదే కార్యక్రమంలో మరో అంశం కూడా విమర్శలకు దారితీసింది. జాతీయ జెండా పూర్తిగా పైకి ఎగరకముందే జాతీయగీతం ప్రారంభించి ఆలపించినట్లు కార్యక్రమానికి హాజరైన వారు తెలిపారు. జాతీయ పతాకం, జాతీయగీతం విషయంలో అత్యంత గౌరవం, నిబంధనలు పాటించాల్సిన అధికారిక కార్యక్రమంలో అధికారులు ఇలా వ్యవహరించడంపై స్థానికంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

బాధ్యులపై చర్యలు తీసుకుంటారా?

జాతీయ పతాక గౌరవానికి సంబంధించిన నిబంధనలు, ప్రివెన్షన్‌ ఆఫ్‌ ఇన్‌సల్ట్‌ టు నేషనల్‌ హానర్‌ యాక్ట్‌, 1971 తదితర చట్టాల ప్రకారం ఈ ఘటనలో నిబంధనల ఉల్లంఘన జరిగిందా లేదా అన్నది జిల్లా ఉన్నతాధికారులు స్పష్టం చేయాల్సి ఉంది. ఈ ఆరోపణలపై జిల్లా అధికారులు ఏ విధంగా స్పందిస్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement