అబ్బయ్య చౌదరి నిర్బంధం
ఏలూరు టౌన్: ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియను లోపభూయిష్టంగా మార్చేసి.. అనర్హులకు పట్టం కడుతూ చేపట్టిన మెగా డీఎస్సీ–25పై వైఎస్సార్‌సీపీ చేపట్టిన ప్రజా ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. కూటమి పాలకుల కూసాలను కదిలించటంతో ప్రభుత్వానికి భయం పట్టుకుంది. రాజకీయ కుట్రలతో వైఎస్సార్‌సీపీ నేతలను అక్రమ కేసులు, నిర్బంధాలతో బెదిరించేందుకు సిద్ధపడ్డారు. ఏలూరు జిల్లా వ్యాప్తంగా డీఎస్సీ అక్రమాలపై చేపట్టిన నిరసన ర్యాలీలకు ప్రజల నుంచి అనూహ్య స్పందన రావడంతో వైఎస్సార్‌సీపీ సమన్వయకర్తలు, పార్టీ నేతలపై అక్రమ కేసులు, నిర్బంధాలతో అణిచివేసే కుట్రలకు తెరతీశారు.
ఏలూరు సమన్వయకర్త జేపీ, పార్టీ నేతలపై కేసు
ఏలూరు నియోజకవర్గంలో డీఎస్సీ అవినీతిపై సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తూ వైఎస్సార్‌సీపీ ఏలూరు సమన్వయకర్త మామిళ్ళపల్లి జయప్రకాష్ సారధ్యంలో చేపట్టిన నిరసన ర్యాలీకి ప్రజలు, నిరుద్యోగ యువత, విద్యార్థుల నుంచి మద్దతు లభించింది. నగర ప్రజలు సైతం కూటమి సర్కారు అక్రమాలపై పెద్దెత్తున చర్చ సాగించడంతో కూటమి పాలనపై విమర్శలు వెల్లువెత్తాయి. వైఎస్సార్‌సీపీ నేతలు, శ్రేణులను అక్రమ కేసులతో బెదిరించకుంటే టీడీపీ ప్రభుత్వం ఆత్మరక్షణలో పడుతుందనే ఉద్దేశంతో 9 మందిపై ఏలూరు వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఏలూరు సమన్వయకర్త జయప్రకాష్‌తో పాటు మరో ఎనిమిది మంది నేతలపై కేసు పెట్టారు. టూటౌన్ సీఐ ఫిర్యాదుతో వన్‌టౌన్ పోలీసులు ఈ కేసు నమోదు చేశారు.
ఏలూరు జిల్లాలోని పోలవరం సమన్వయకర్త తెల్లం బాలరాజు, ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు, పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావును సైతం పోలీసులు ర్యాలీలు చేయకుండా అడ్డుకున్నారు. ప్రజలతోపాటు, పార్టీ నేతలు, యువత, విద్యార్థుల మద్దతుతో అన్ని నియోజకవర్గాల్లోనూ డీఎస్సీపై చేపట్టిన నిరసన ర్యాలీలు విజయవంతం కావడంతో కూటమి నేతలకు నిద్రపట్టడం లేదు. ప్రజలు వైఎస్సార్‌సీపీ నేతలతో ధైర్యంగా ర్యాలీలకు, నిరసనలకు వెళ్ళడం కూటమి నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని, అక్రమ కేసులతో నిలువరించే కుట్రలకు పాల్పడుతున్నారంటూ వైఎస్సార్‌సీపీ నేతలు మండిపడుతున్నారు.
దెందులూరు సమన్వయకర్త కొఠారు అబ్బయ్య చౌదరిపై కూటమి నేతల ఒత్తిళ్లతో పోలీస్ అధికారులు బెదిరింపులకు పాల్పడుతున్నారు. మూడు రోజుల క్రితం ఏలూరు అశోక్‌నగర్‌లోని పార్టీ కార్యాలయం నుంచి రిలే నిరాహారదీక్షలకు వెళ్ళేందుకు వీల్లేదంటూ అడ్డుకోగా, సోమవారం నిరసన ర్యాలీ చేయకుండా గృహ నిర్బంధం చేశారు. రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన రక్షకభటులే శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును కాలరాస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారంటూ ప్రజలు పోలీసుల తీరును తప్పుబడుతున్నారు.
వైఎస్సార్‌సీపీ శాంతియుత నిరసనలపై నిర్బంధం
కేసులతో భయపెట్టే కుట్ర
ఏలూరు, నూజివీడు సమన్వయకర్తలు, నేతలపై కేసులు
దెందులూరు ఇన్‌చార్జి అబ్బయ్యచౌదరి గృహనిర్బంధం


