నూరు మార్కుల కలలకు రెక్కలు | - | Sakshi
Sakshi News home page

నూరు మార్కుల కలలకు రెక్కలు

Aug 12 2026 1:16 AM | Updated on Aug 12 2026 1:16 AM

తెలుగుపై శ్రద్ధ పెంచేందుకే..

టెన్త్‌లో 100 మార్కులొస్తే విమాన ప్రయాణం హామీ

10 మంది విద్యార్థులకు బహుమానం

తెలుగు, సోషల్‌పై శ్రద్ధ పెంచేందుకు దోహదం

నిడమర్రు: విద్యార్థులను చదువుల్లో ప్రోత్సహించే ఉద్దేశంతో ఉపాధ్యాయులు చేసిన వినూత్న ఆలోచనపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పదో తరగతి పలితాల్లో మంచి మార్కులు తెచ్చుకునేలా ప్రోత్సహించేందుకు తెలుగు, సోషల్‌ సబ్జెక్టులో 100 మార్కులు తెచ్చుకునే విద్యార్థులను విమానం ఎక్కిస్తానని ఆయా సబ్జెక్టు టీచర్స్‌ హామీ ఇచ్చారు. ఈ ఏడాది విడుదలైన పది ఫలితాల్లో 8 మంది విద్యార్థులు తెలుగు భాషలో, ఇద్దరు విద్యార్థులు సోషల్‌ సబ్జెక్టులో 100 మార్కులు తెచ్చుకోవడంతో ఆ ఉపాధ్యాయులు తన హామీని నిలబెట్టుకున్నారు. ఆ పది మంది విద్యార్థులను తన సొంత ఖర్చులతో విమానంలో వేరే రాష్ట్రానికి తీసుకువెళ్లి వారి కలను నెరవేర్చారు. ఇది విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులకు ఉన్న అంకితభావాన్ని తెలియజేస్తుందని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిడమర్రు మండలం పెదనిండ్రకొలను జవహర్‌లాల్‌ నెహ్రూ ఉన్నత పాఠశాలలో తెలుగు, సోషల్‌ ఉపాధ్యాయులు షేక్‌ మౌలాలీ, ఎన్‌.శర్మిలలు తమ విద్యార్థులకు ఈ విమానయానం బహుమతి ఇచ్చారు. అన్న మాట ప్రకారం తెలుగు భాషలో నూటికి నూరు మార్కులు సాధించిన 8 మందిని, సోషల్‌ సబ్జెక్టులో ఇద్దరు విద్యార్థులను గన్నవరం నుంచి విమానంలో విహారయాత్ర తరహాలో హైదరాబాద్‌ తీసుకువెళ్లి మూడు రోజుల పాటు ప్రముఖ పర్యాటక ప్రాంతాలను వారు తిలకించేలా కృషి చేసి సోమవారం తిరిగి గ్రామానికి తీసుకువచ్చారు. దీంతో ఆనందోత్సాహాలకు అవధుల్లేవని ట్రిప్‌కు వెళ్లిన విద్యార్థులు చెపుతున్నారు. విద్యార్థులతోపాటు హామీ ఇచ్చిన ఉపాధ్యాయులు షేక్‌ మౌలాలి, ఎన్‌.శర్మిల, సైన్స్‌ టీచర్లు సుబ్బరాజు, గోపాలకృష్ణలు ఉన్నారు.

విద్యార్థులు, తల్లిదండ్రులు గణితం, సైన్స్‌లో నూటికి నూరు వస్తే భవిష్యత్‌ అని భావిస్తారు. ఆ దిశగా ఆయా సబ్జెక్టులపై దృష్టి పెట్టి, తెలుగుపై తక్కువ శ్రద్ధ పెడతారు. తెలుగులోనూ నూటికి నూరు శాతం లక్ష్యం ఉండాలనే ఆశయంతో గత రెండేళ్లుగా టెన్త్‌ విద్యార్థులకు ఈ వియాన ప్రయాణం హామీతో ప్రోత్సహిస్తున్నాను. గతేడాది ఇద్దరు విద్యార్థులను, ఈ ఏడాది 8 మంది విద్యార్థులను విమానం ఎక్కించాను. నూరు మార్కుల ప్రోత్సాహంతో మా విద్యార్థు సరేళ్ల కీర్తన 591 మార్కులతో (3 సబ్జెక్టుల్లో 100 మార్కులు) జిల్లా ఫస్ట్‌ సాధించింది.

–షేక్‌ మౌలాలీ, ఎస్‌ఏ, తెలుగు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement