శ్రావణం ఎంతో శుభప్రదం
● రేపటి నుంచే ప్రారంభం
● వ్రతాలు, నోములకు మహిళల సమాయత్తం
● ఆలయాల్లో ఏర్పాట్లు చేస్తున్న అధికారులు
● శుభకార్యాలకూ ఇదే సమయం
ద్వారకాతిరుమల: తెలుగు క్యాలెండర్లోని పన్నెండు నెలల్లో శ్రావణం ఎంతో విశిష్టమైనది. సకల శుభాలకు ఆవాసంగా నిలిచే శ్రావణ మాసం ఈనెల 13న ఆరంభం కానుంది. ప్రతి ఇల్లు ఓ ఆలయంగా మారి.. ఉదయం, సాయంత్రం వేళల్లో భగవన్నామస్మరణతో మార్మోగనుంది. సామూహిక వరలక్ష్మీవ్రతాలు, పవిత్రోత్సవాలు, కృష్ణాష్టమి వేడుకలు వరుసగా జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాలోని అన్ని ఆలయాల్లో భక్తుల సౌకర్యార్థం అధికారులు, కమిటీ సభ్యులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు.
మహిళలకూ ప్రత్యేకం
ఈ మాసం మహిళలకు ఎంతో ప్రీతిపాత్రమైంది. ధార్మిక, ఆధ్మాత్మిక, వ్యాపార ప్రారంభం వంటి శుభకార్యాలతో ముడిపడి ఉంటుంది. వివాహం, గృహ ప్రవేశం, గృహ నిర్మాణం, నామకరణం వంటి అనేక శుభకార్యాలు నిర్వహించడానికి మంచి నెలగా అందరూ భావిస్తారు. ఆషాఢంలో ఎడబాటుకు గురైన కొత్త దంపతులు శ్రావణంలో కలుస్తారు. మహిళలు వ్రతాలు, లక్ష్మీదేవికి విశేష పూజలు నిర్వహిస్తారు. ఈ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారానికి ఒక విశిష్టత ఉంటుంది. నెల రోజులుగా ఆషాఢ మాసంలో ముహూర్తాలు లేవు. ఈనెల 13 నుంచి శ్రావణ మాసం ప్రారంభం కానుండటంతో మహిళలు శ్రావణ లక్ష్మీవ్రతాలను ఆలయాల్లో భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. పెళి ముహూర్తాలు 15 నుంచి మొదలవనున్నాయి.
విష్ణు పూజలకు ప్రసిద్ధి..
సర్వమంగళ కారియైన గౌరి, లక్ష్మి, హరిహరులను విశేషంగా అర్పించే నెల కూడా ఇదే. చాంద్రమానం ప్రకారం శ్రావణాన్ని ఐదో నెలగా పరిగణిస్తారు. ఈ నెల పౌర్ణమిన చంద్రుడు శ్రవణ నక్షత్ర సమీపంలో సంచరిస్తున్నందున శ్రావణ మాసం అనే పేరు వచ్చినట్లు పండితులు చెబుతారు. శ్రవణ నక్షత్రం మహావిష్ణువు జన్మ నక్షత్రం కావటంతో విష్ణు పూజలకు ప్రసిద్ధి. ఈ నెలలో వచ్చే మంగళ, శుక్ర, శనివారాలను అత్యంత పుణ్యప్రదమైనవిగా భావిస్తారు. మంగళవారం గౌరీ పూజలు, శుక్రవారాల్లో లక్ష్మీ పూజలు, శనివారాల్లో విష్ణు పూజలు చేస్తారు.
వ్యాపారులకు ఊరట
దాదాపు 60 రోజులుగా వివాహ ముహూర్తాలు లేకపోవడంతో ప్రధానంగా పెళ్లిళ్లపై ఆధారపడి వ్యాపారాలు సాగిస్తున్న కల్యాణ మండపాలు, వస్త్ర, నగల దుకాణాలు వెలవెలబోయాయి. పెళ్లి తంతు నిర్వహించే పురోహితులు ఖాళీగా ఉన్నారు. అలాగే ఫొటోగ్రాఫర్లు, కేటరింగ్, డెకరేషన్ వారు, భోజనాల తయారీ వారు డీలా పడ్డారు. శ్రావణ మాసం రానుండటంతో వారికి ఊరట లభించనుంది.
ముఖ్యమైన పండుగలు :
శ్రావణ మాసంలో ఎన్నో విశేష పండుగలు వస్తాయి. ఈ నెల 14న తొలి శుక్రవారం, 15న స్వాతంత్య్ర దినోత్సవం, 21న రెండో శుక్రవారం, ఈనెల 26 నుంచి నాలుగు రోజులపాటు ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు జరుగుతాయి. 28న మూడో శుక్రవారం వరలక్ష్మీ వ్రతం, అదేరోజు రాఖీ పండుగ, జంధ్యాల పౌర్ణమి, వచ్చేనెల 4న నాల్గవ శుక్రవారం, శ్రీకృష్ణాష్టమి వంటి ముఖ్యమైన పండుగలు ఉన్నాయి. 11న ఐదో శుక్రవారంతో శ్రావణ మాసం ముగుస్తుంది.
శ్రీవారి ఆలయ అనివెట్టి మండపంలో జరుగుతున్న వివాహం (ఫైల్)
కుంకుళ్లమ్మ ఆలయం
క్షేత్ర దేవత కుంకుళ్లమ్మ అమ్మవారు
శ్రావణమాసం అంటే ఎంతో పవిత్రమైనదిగా, ప్రధానమైనదిగా భావిస్తారు. జ్ఞానసిద్ధిని అందించే మాసంగా పురాణాల్లో పేర్కొన్నారు. వైష్ణవారాధనతో పాటు మహా శివునికి పెద్ద ఎత్తున రుద్రాభిషేకాలు నిర్వహిస్తారు. ముఖ్యంగా వివాహాది శుభకార్యాలకు శ్రావణమాసంలో మంచి ముహూర్తాలు ఉన్నాయి. ఈనెల 15 నుంచి పెప్టెంబర్ 11 వరకు సుముహూర్తాలు ఉన్నాయి. ద్వారకాతిరుమ చినవెంకన్న ఆలయంలో ఈ మాసంలో వందల సంఖ్యలో వివాహాలు జరగనున్నాయి.
– గోవిందవఝుల వెంకటరమణ మూర్తి శర్మ, పురోహితుడు, ద్వారకాతిరుమల


