చింతలపూడి (జంగారెడ్డిగూడెం): గురవాయిగూడెంలోని మద్ది ఆంజనేయస్వామి ఆలయానికి మంగళవారం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. పరిసర గ్రామాలతో పాటు సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామి ప్రాంగణంలో 108 ప్రదక్షిణలు చేసి మొక్కుబడులు తీర్చుకున్నారు. స్వామికి ప్రీతిపాత్రమైన తమలపాకులతో అష్టోత్తర అర్చనలు, అన్నప్రాసనలు, వాహన పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం 4 గంటల సమయానికి వివిధ సేవల ద్వారా ఆలయానికి రూ.2,34,351 ఆదాయం లభించినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. నిత్యాన్నదాన సత్రంలో 2,467 మంది భక్తులకు అన్నప్రసాద వితరణ చేసినట్లు ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు రాజాన సత్యనారాయణ, కార్యనిర్వహణాధికారిణి ఆర్.వి.చందన వెల్లడించారు.
బుట్టాయగూడెం: మండలంలోని బుట్టాయగూడెం, దొరమామిడి గ్రామాల్లో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు పునరావాస కాలనీ పనులపై పోలవరం ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్ అభిషేక్, చింతూరు ప్రాజెక్టు ఆఫీసర్ శుభం నొక్వాల్, ఐటీడీఏ పీఓ కె.రాములు నాయక్ మంగళవారం వివిధ ఇంజనీరింగ్ అధికారులతో ఐటీడీఏలో సమీక్షించారు. ఈ సందర్భంగా ఇళ్ల నిర్మాణం పనుల్లో పురోగతిని అడిగి తెలుసుకున్నారు. నిర్ణీత గడువులోగా పనులు పూర్తయ్యేలా చూడాలని పనుల్లో నాణ్యతా లోపాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం ఆర్ ఆండ్ ఆర్ ఇళ్ల పనులను పరిశీలించడంతోపాటు మర్లగూడెం వద్ద ఉన్న భూములను పరిశీలించారు.
భీమవరం (ప్రకాశంచౌక్): భీమవరం కొత్త బస్టాండ్ సమీపంలో ఉన్న బ్రహ్మసూత్ర శివాలయంలో ఆషాఢ మాసం మాస శివరాత్రి సందర్భంగా స్వామికి శాకంబరేశ్వర అలంకారం నిర్వహించారు. స్వామిని భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
తాడేపల్లిగూడెం (టీఓసీ): తాడేపల్లిగూడెంకు చెందిన సుప్రసిద్ధ తెలుగు సినీ హాస్య నటుడు, పద్మశ్రీ రేలంగి వెంకట్రామయ్య విగ్రహ ఆవిష్కరణ ఈ నెల 14న సాయంత్రం 4 గంటలకు టూటౌన్‌లోని రేలంగి చిత్రమందిర్ థియేటర్ కాంప్లెక్స్ కూడలిలో నిర్వహిస్తున్నట్లు రేలంగి కుటుంబ సభ్యులు తెలిపారు. రేలంగి అభిమానులు, కళాకారులు పాల్గొనాలని కోరారు.
నరసాపురం: గ్రేడ్–1 మున్సిపాలిటీగా ఉన్న నరసాపురం మున్సిపాలిటీని స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ చేశారు. 1956లో ఏర్పడ్డ మున్సిపాలిటీ ప్రసుత్తం 60 వేల జనాభాతో 31 వార్డులతో ఉంది. స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. దీంతో మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు మరింత ఎక్కువగా జరగడానికి అవకాశం ఉంది. మరో ఏడాదిలో గోదావరి పుష్కరాలు రానున్నాయి. ఈ దశలో మున్సిపాలిటీకి స్పెషల్ గ్రేడ్ దక్కడంపై పట్టణ వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


