ద్వారకాతిరుమల: క్షేత్రపాలకుడిగా విరాజిల్లుతోన్న శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామి ఆలయంలో శివదేవునికి ఏకాదశ రుద్రాభిషేకాన్ని మంగళవారం నేత్రపర్వంగా నిర్వహించారు. మాసశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ వేడుకను వైభవంగా జరిపారు. ముందుగా దేవస్థానం సిబ్బంది ఆలయాన్ని, పరిసరాలను శోభాయమానంగా అలంకరించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ శివదేవునికి రుద్రాభిషేకాన్ని జరిపి, హారతులిచ్చారు. రాత్రి గంగా, పార్వతీ సమేత శివదేవుని గ్రామోత్సవం నంది వాహనంపై కన్నులపండువగా జరిగింది.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): నగరంలోని సిద్ధార్థ క్వెస్ట్ స్కూల్‌లో మంగళవారం నిర్వహించిన టెట్ పరీక్షకు 324 మంది హాజరయ్యారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ జరిగిన పరీక్షకు 175 మందికి గాను 158 మంది హాజరు కాగా మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ జరిగిన పరీక్షకు 175 మందికి 166 మంది హాజరయ్యారు. పరీక్షా కేంద్రాలను జిల్లా స్థాయి పరిశీలకుడు కే. నాగేశ్వరరావు, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం సందర్శించి పర్యవేక్షించారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని, మాల్‌ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని జిల్లా విద్యాశాఖాధికారి తెలిపారు.


