ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లాలోని వాహన తనిఖీ అధికారులు గత నెల 12వ తేదీ నుంచి ఈ నెల 20 వరకూ వివిధ ప్రైవేటు విద్యా సంస్థలకు చెందిన 179 బస్సులపై కేసులు నమోదు చేసి, రూ.3.95 లక్షల అపరాధ రుసుము విధించినట్లు ఉప రవాణా కమిషనరు షేక్ కరీమ్ మంగళవారం తెలిపారు. ఇందులో వీఎల్‌టీడీ లేని 144 బస్సులపై కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. ప్రతి స్కూల్ బస్సుకు తప్పనిసరిగా వీఎల్‌టీడీ పరికరాన్ని కలిగి ఉండాలని, డ్యాష్ బోర్డు కెమెరాలను బిగించాలన్నారు. ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు రహదారి భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని, విద్యార్థులను సురక్షితంగా తరలించాలని, లేని పక్షంలో కేసులు నమోదు చేయడంతో పాటు బస్సులను సీజ్ చేస్తామని డీటీసీ కరీమ్ హెచ్చరించారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): రాష్ట్రంలో ఎస్సీలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఏపీ మాల సంక్షేమ సహకార ఆర్థిక సంస్థ చైర్మన్ పెదపూడి విజయకుమార్ స్పష్టం చేశారు. స్థానిక గిరిజన భవనంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో మాలల సంక్షేమానికి, అభివృద్ధికి పూర్వవైభవం తీసుకువస్తా మని ఆయన పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పర్యటించి, క్షేత్రస్థాయి సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. దళితుల హక్కులు, కార్పొరేషన్ ద్వారా పేదలకు అందాల్సిన ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, శిక్షణలపై పూర్తిస్థాయి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ విషయాలపై అధికారులు కూడా ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. సమాజంలో ఎస్సీలు ఆర్థికంగా బలోపేతం కావడానికి సీని యర్ నాయకుల నుంచి సలహాలు, సూచనలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఎం. ముక్కంటి, ఏపీ మాల సంక్షేమ సహకార ఆర్థిక సంస్థ డైరెక్టరు దాసరి ఆంజనేయులు, కృష్ణా జిల్లా డైరెక్టరు దయాల రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లాలో ఆగస్టు నెలలో 26 గ్రామాలకు చెందిన రైతులకు 14,153 పట్టాదారు పాస్‌పుస్తకాలు పంపిణీ చేయడానికి తగిన చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ కే. వెట్రిసెల్వి, రాష్ట్ర భూపరిపాలనా ప్రధాన కమిషనర్ జి.జయలక్ష్మికి వివరించారు. రాష్ట్ర సచివాలయం నుంచి 22–ఎ దరఖాస్తుల పరిష్కారం, పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ, రీ–సర్వే, ఐవీఆర్‌ఎస్ సర్వే, ఇతర రెవెన్యూ సమస్యల పరిష్కారంపై భూపరిపాలనా ప్రధాన కమిషనర్ మంగళవారం వివిధ జిల్లాల కలెక్టర్లతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ పాస్‌పుస్తకాల పంపిణీకి సంబంధించి ఈ–కేవైసీ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేస్తున్నామని తెలిపారు. అలాగే 22–ఎ భూ సమస్యలకు సంబంధించి జిల్లాలో ఇప్పటివరకు 410 దరఖాస్తులు రాగా, అందులో 107 దరఖాస్తులను ఆమోదించినట్లు చెప్పారు. నిబంధనల ప్రకారం లేని 109 దరఖాస్తులను తగిన కారణాలు తెలియజేస్తూ తిరస్కరించామన్నారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): గోదావరి పుష్కరాలు – 2027 ఏర్పాట్లపై రాష్ట్ర సచివాలయం నుంచి పుష్కరాల ప్రత్యేక అధికారి వీరపాండియన్, ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శులు ప్రద్యుమ్న, కార్తికేయ మిశ్రా మంగళవారం సాయంత్రం సమీక్షా సమావేశం నిర్వహించారు. సంబంధిత శాఖల అధికారులు, ఆయా జిల్లాల కలెక్టర్లతో వారు జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. గోదావరి పుష్కరాల సందర్భంగా స్నాన ఘాట్ల నిర్మాణం, ఘాట్లలో మౌలిక సదుపాయాల కల్పన, పుష్కర ప్రాంతాల్లో రోడ్ల అభివృద్ధి, రవాణా, భద్రత తదితర అంశాలపై వివిధ శాఖల ఉన్నతాధికారులు సమర్పించిన ప్రతిపాదనలను ఈ సందర్భంగా పరిశీలించి సమీక్షించారు. జూమ్ కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ కే. వెట్రిసెల్వితో పాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.


