● మహిళలకు భద్రత కల్పించడంలో ఘోర వైఫల్యం
● ఏలూరులో వైఎస్సార్‌సీపీ మహిళా నేతల భారీ ర్యాలీ
ఏలూరు టౌన్: టీడీపీ కూటమి పాలనలో మహిళలపై జరుగుతున్న దాడులు, లైంగిక వేధింపులు, హత్యాచారాలను నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఏలూరులో మంగళవారం భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు కేసరి సరితారెడ్డి నేతృత్వంలో పార్టీ కార్యాలయం నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు పాదయాత్రగా వచ్చిన మహిళలు, అక్కడ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని, మహిళా హోంమంత్రి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి, చింతలపూడి సమన్వయకర్త కంభం విజయరాజు, ఏలూరు సమన్వయకర్త మామిళ్ళపల్లి జయప్రకాష్ ముఖ్యఅతిథులుగా పాల్గొని సంఘీభావం తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న వైఎస్సార్‌సీపీ మహిళ విభాగం అధ్యక్షులు, రాష్ట్ర, జిల్లా స్థాయి మహిళనేతలు, కార్యకర్తలు, మహిళలు భారీ సంఖ్యలో హాజరై కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ధ్వజమెత్తారు.
అంబేడ్కర్ రాజ్యాంగం అమలు చేయండి
ఈ సందర్భంగా జిల్లా మహిళా అధ్యక్షురాలు సరితారెడ్డి మాట్లాడుతూ, కూటమి నేతలు రెడ్‌బుక్ రాజ్యాంగం కాకుండా అంబేడ్కర్ రాజ్యాంగాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. సీఎం చంద్రబాబుకు అమరావతిపై ఉన్న శ్రద్ధ మహిళల రక్షణపై లేదని, టీడీపీ నేతల అండతోనే మహిళలపై దాడులు పెరిగాయని ఆరోపించారు. రాజకీయ ఒత్తిళ్లతో కేసులు నమోదు కావట్లేదని, పోలీసుల నిర్లక్ష్యంపై ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలపై నేరాలకు పాల్పడితే తాట తీస్తామని చెబుతున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేష్ ఏం చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.
హోమంత్రి రాజీనామా చేయాలి
ఏలూరు నగర మహిళా అధ్యక్షురాలు జిజ్జువరపు విజయనిర్మల మాట్లాడుతూ, గుంటూరులో టీడీపీ నేత ఆధ్వర్యంలో మహిళలను వివస్త్రను చేయటం, మరో జనసేన నేత మహిళ జాకెట్ చింపిన సంఘటనలు చోటుచేసుకోవటం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో మహిళా హోంమంత్రి ఉన్నా రక్షణ లేకపోవడం దారుణమని, ఎన్నికల ముందు చెప్పిన మహిళల భద్రత ఏమైందని ప్రశ్నించారు. రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి తుమరాడ స్రవంతి మాట్లాడుతూ, గుంటూరులో మహిళను వివస్త్రను చేసిన ఘటనపై స్పందించని హోంమంత్రికి పదవిలో ఉండే అర్హత లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దెందులూరు జెడ్పీటీసీ నిట్టా లీలానవకాంతం మాట్లాడుతూ, ప్రభుత్వం నేరస్తులకు అండగా ఉంటూ పోలీసులను నిర్వీర్యం చేస్తోందని విమర్శించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా మహిళ ప్రధాన కార్యదర్శి జగ్గవరపు జానకిరెడ్డి, అధికార ప్రతినిధి ఇంజేటి నీలిమ, జెడ్పీటీసీలు నీరజ, తుమ్మగుంట భవానీ, రాష్ట్ర మహిళ ప్రధాన కార్యదర్శి కనకదుర్గ రాణి, మహిళా కార్యదర్శులు వేదకుమారి, మంద జయలక్ష్మి, ఆర్తి పార్వతి, కై కలూరు నియోజకవర్గం మహిళ అధ్యక్షురాలు దున్న బేబీ, చింతలపూడి నియోజకవర్గ మహిళ అధ్యక్షురాలు చండీప్రియ, ఉంగుటూరు నియోజకవర్గం మహిళ అధ్యక్షురాలు గంటా శ్రీలక్ష్మి, నూజివీడు మహిళ అధ్యక్షురాలు సుజనాకుమారి, అంగన్‌వాడీ విభాగం అధ్యక్షురాలు స్వాతియాదవ్, వలంటీర్ వింగ్ జిల్లా అధ్యక్షురాలు భోగిశెట్టి పార్వతి, ఎంపీపీలు రమ్యకుమారి, భక్తుల రమాదేవి, గిరిజ, మున్సిపల్ మాజీ ఛైర్మన్ మద్దిరాల కోటమ్మ తదితరులు పాల్గొన్నారు.
పాతబస్టాండ్ సెంటరులో అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేస్తున్న వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం నేతలు
ర్యాలీలో పాల్గొన్న పార్టీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి, ఏలూరు సమన్వయకర్త జయప్రకాష్ తదితరులు


