మావుళ్లమ్మకు బంగారం సమర్పణ
భీమవరం (ప్రకాశంచౌక్): శ్రీ మావుళ్లమ్మ తల్లికి సంపూర్ణ స్వర్ణ వస్త్రం నిధికి ముప్పాళ్ళ నరసరాజు, నాగమణి దంపతులు రూ.లక్ష విరాళంగా అందజేశారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): నగరంలో తాగునీటి సమస్య తలెత్తకుండా దెందులూరు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్‌ను పూర్తిస్థాయిలో నింపేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏలూరు మేయర్ షేక్ నూర్జహాన్ మంగళవారం కలెక్టర్ కె.వెట్రిసెల్వికి వినతిపత్రం అందజేశారు. కలెక్టరేట్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. జూన్ నెల 1 నుంచి గోదావరి కాలువకు నీరు విడుదల చేసినప్పటికీ కాలువలో పూడికలు తొలగింపు పని పూర్తికాని కారణంగా జూన్ 10 వరకు దెందులూరు సమ్మర్ స్టోరేజీ ట్యాంక్ వద్ద చాంబర్ వరకు నీటి సరఫరా జరగలేదన్నారు. జూన్ 11 నుంచి నీటిని విడుదల చేసినప్పటికీ కాలువలో నీటి స్థాయి 1.5 అడుగుల నుంచి 2 అడుగుల లోపు మాత్రమే ప్రవహిస్తున్న కారణంగా చెరువును నింపడానికి పూర్తి స్థాయిలో మోటార్లను వినియోగించడానికి వీలుపడలేదన్నారు. గోదావరి కాలువల్లో పూడికతీత పనులు పూర్తికాకపోవడం, కాలువలో నీటి మట్టం తక్కువగా ఉండటంతో 3 వేల మిలియన్ లీటర్ల సామర్థ్యం గల సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్‌లో ప్రస్తుతం కేవలం 270 మిలియన్ లీటర్ల నీరు మాత్రమే ఉందని, ఇది ఏడు రోజులకు సరిపోతుందని మేయర్ వివరించారు. గోదావరి కాలువ నుంచి వచ్చే నీటిని మధ్యలో మళ్లించకుండా, ట్యాంక్ నింపేందుకు వీలుగా ఇరిగేషన్ అధికారులను ఆదేశించాలని ఆమె కలెక్టర్‌ను కోరారు. స్పందించిన కలెక్టర్, చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.


