ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా అమలు చేస్తున్న పంటల బీమా పథకంలో ప్రతి రైతు నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కే వెట్రిసెల్వి వ్యవసాయ అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లో ‘పునర్వ్యవస్థీకరించబడిన వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం’పై రూపొందించిన వాల్ పోస్టర్‌ను మంగళవారం ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... వాతావరణం ప్రతికూల పరిస్థితుల కారణంగా పంట నష్టాల నుంచి రైతులను ఆదుకునేందుకే ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోందన్నారు. రైతులు పత్తి పంటకు ఎకరానికి రూ.1,900, నిమ్మ పంటకు రూ.2,500 చొప్పున జూలై 31వ తేదీలోగా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. అకాల లేదా అధిక వర్షపాతం, చీడపీడలకు అనుకూలించే వాతావరణం, అధిక ఉష్ణోగ్రతలు, ఈదురు గాలులు, గాలిలో తేమ శాతం తదితర కారణాలతో నష్టం జరిగితే జిల్లాలో పత్తి, నిమ్మ పంటలకు ఈ బీమా వర్తిస్తుందన్నారు. పరిహారంగా పత్తి పంటకు ఎకరానికి రూ. 38 వేలు, నిమ్మ పంటకు రూ. 50 వేల చొప్పున అందుతుందని ఆమె వివరించారు.
24న మెగా పేరెంట్స్, టీచర్స్ మీట్ : పాఠశాలలో విద్యా ప్రమాణాల స్థాయి పెరిగేలా ‘మెగా పేరెంట్స్, టీచర్స్ మీట్’ అర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ కే వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. ఆమె స్థానిక కలెక్టరేట్ నుంచి మంగళవారం మెగా పేరెంట్స్, టీచర్స్ మీట్ నిర్వహణ ఏర్పాట్లపై టెలీ కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో సమీక్షించారు. ఈనెల 24వ తేదీన జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలు, కళాశాలల్లో మెగా పేరెంట్స్, టీచర్స్ మీట్ ఆహ్లాదకరమైన వాతావరణంలో నిర్వహించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.


