నూతనోత్సాహం
ఈరోజు మీరు చూపిస్తున్న ఈ ఆదరణ, అభిమానానికి నిజంగా నోటి నుంచి మాట కూడా రానంతగా భావోద్వేగం. ఇసుక వేసినా రాలనంతగా, కంటి చూపు మేరలో ఎక్కడా కూడా ఖాళీ స్థలం కనిపించనంతగా, ఈ అభిమాన తరంగాల మధ్య మీరు చూపిస్తున్న ఈ ప్రేమ, ఈ అభిమానానికి ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి రెండు చేతులు జోడించి పేరుపేరునా హృదయ పూర్వక కృతజ్ఞతలు.
– భీమవరంలో తన కోసం వచ్చిన
అభిమాన సంద్రాన్ని చూసి మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్న మాటలివి
సాక్షి, భీమవరం: సిండికేట్ దోపిడీతో కుదేలవుతున్న ఆక్వా రైతులకు అండగా 15న జగన్ భీమవరం వస్తున్నారని రెండు వారాల క్రితం వైఎస్సార్‌సీపీ నేతలు ప్రకటించిన నాటి నుంచే సభ భగ్నానికి కూటమి కుట్రలకు తెరలేపింది. సభను ఫెయిల్యూర్ చేసే లక్ష్యంతో భీమవరం, వీరవాసరం, పాలకొల్లు, తణుకు, ఆకివీడులలో టీడీపీ, జనసేన పార్టీకి చెందిన పలువురు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై బురదజల్లుతూ చంద్రబాబు సర్కారు చేస్తున్న దగాను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు. సభకు రైతులు రాకుండా ఆపాలని చూశారు. 14న మధ్యాహ్నం వరకు హెలీప్యాడ్‌కు అనుమతులు రాకుండా అడ్డుకున్నారు. రోడ్డు, లేదా రైలు మార్గం ద్వారా జగన్ భీమవరం వచ్చితీరతారని, దారిలో జన సునామీని ఆపడం మాతరం కాదని వైఎస్సార్‌సీపీ నేతలు స్పష్టం చేయడంతో హైడ్రామాకు తెరదించుతూ సభ ప్రారంభానికి కొన్ని గంటల ముందు హెలీప్యాడ్‌కు ప్రభుత్వం నుంచి అనుమతి రావడం గమనార్హం. రైతుల రాకను అడ్డుకోవాలన్న కూటమి ప్రయత్నాలు విఫలమయ్యాయి.
జన జాతర
సార్వత్రిక ఎన్నికల అనంతరం ప్రభుత్వంపై పోరాటంలో భాగంగా ఆక్వా రైతులకు అండగా భీమవరం వచ్చిన జగన్‌కు జనం బ్రహ్మరథం పట్టారు. సభ ఉదయం 11 గంటలకు కాగా 8 గంటల నుంచే పట్టణంలోని జువ్వలపాలెం, ఉండి, లోసరి, పా లకొల్లు, తాడేపల్లిగూడెం, నరసాపురం రోడ్లు జనంతో రద్దీగా కనిపించాయి. ఉమ్మడి ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల నుంచి వేలాదిగా ఆక్వా రైతులు, వైఎస్సార్‌సీపీ శ్రేణులు తరలివచ్చారు. తమ అభిమాన నాయకుడిని ప్రత్యక్షంగా చూడాలని చిన్నాపెద్దా, ఆడమగా తేడాలేకుండా ప్రజలు పెద్ద సంఖ్యలో చేరడంతో హెలీప్యాడ్ నుంచి సభావేదిక వరకు రోడ్డు మొత్తం జనజాతరను తలపించింది. దారి మొత్తం జై జగన్ నినాదంతో మార్మోగింది. తాలుకా ఆఫీస్ సెంటర్, ప్రకాశం చౌక్, అంబేడ్కర్ సెంటర్, బీవీరాజు సెంటర్‌లు కిక్కిరిసిపోయాయి. లూథరన్ గ్రౌండ్ నుంచి జగన్ కాన్వాయి బైపాస్ రోడ్డులోని డాక్టర్ బీవీ రాజు విగ్రహం సమీపంలోని సభా ప్రాంగణం చేరుకునేందుకు కేవలం 1.5 కి.మీ దూరానికి గంటకు పైనే సమయం పట్టింది. జగన్ మాట్లాడుతూ అధైర్యపడవద్దు నేనున్నానని, మూడేళ్ల తర్వాత వచ్చేది మన ప్రభుత్వమేనని, చంద్రబాబు సిండికేట్‌ను కూకటి వేళ్లతో పెకిలిస్తానంటూ ఇచ్చిన హామీ ఆక్వా రైతుల్లో కొండంత ధైర్యాన్ని నింపింది.
పోలీసుల ప్రేక్షక పాత్ర
వేలాదిగా జనం తరలిరాగా వారిని అదుపు చేయడంలో పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించారన్న విమర్శలున్నాయి. భారీగా జనం తరలివస్తున్నారని ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం ఉన్నా జగన్‌కు జెడ్‌ఫ్లస్ కేటగిరీ భద్రత కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది. సభా వేదికపైగా ఒక్కసారిగా అభి మానులు చొచ్చుకురావడంతో వారిని కంట్రోల్ చేసేందుకు పార్టీ నేతలు, వైఎస్సార్‌సీపీ వలంటీర్లు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.
జన సునామీ
భీమవరంలో జగన్ ఆక్వా సభ సూపర్ సక్సెస్
జనాభిమానం ముందు పారని కూటమి కుట్రలు
వెల్లువలా తరలివచ్చిన రైతులు, జనం
జనసంద్రాన్ని తలపించిన భీమవరం రోడ్లు
అడుగడుగునా జననేతకు బ్రహ్మరథం
రెట్టించిన ఉత్సాహంలో వైఎస్సార్‌సీపీ శ్రేణులు
ఆక్వా రైతుల సభ సూపర్ సక్సెస్ కావడం వైఎస్సార్‌సీపీలో జోష్ నింపింది. కూటమి కుట్రలను దాటుకుని కనివినీ ఎరుగని రీతిలో అంచనాలకు మించి భారీగా జనం రావడంతో జిల్లాలోని వైఎస్సార్‌సీపీ కేడర్‌లో ఉత్సాహం ఉరకలెత్తుతోంది. భీమవరంలో మునుపెన్నడూ ఈ స్థాయిలో జనసంద్రాన్ని చూడలేదని స్థానికులు అంటున్నారు. జగన్ భీమవరం పర్యటన ఖరారైన నాటి నుంచి సభ విజయంతానికి పార్టీ రీజనల్ కో–ఆర్డినేటర్ గుడివాడ అమర్నాధ్, జిల్లా అధ్యక్షుడు ము దునూరి ప్రసాదరాజు నేతృత్వంలో రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామస్థాయి కేడర్ మొత్తం సభ విజయవంతానికి సమష్టిగా పనిచేశారు. సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ని యోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించుకుని ప్రణాళికాబద్ధంగా పనిచేశారు. నియోజకవర్గాల నుంచి మోటారు సైకిల్, ఆటోలు, కార్లు ర్యాలీలుగా జనం జగన్ సభకు తరలివచ్చారు.


