ఏలూరు (టూటౌన్): ఏలూరు నగరపాలక సంస్థ ఆఖరి సమావేశం గురువారం వాడీవేడిగా సాగింది. అజెండాలో పొందుపర్చిన 17 అంశాల్లో పలు వాటిపై వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో పెద్ద ఎత్తున వాదోపవాదాలు కొనసాగాయి. కౌన్సిల్ సమావేశం అరుపులు కేకలతో దద్దరిల్లింది. చివరకు అజెండాలో 17 అంశాలను కౌన్సిల్ సమావేశంలో ఏకగ్రీవంగా ఆమోదించినట్టు పేర్కొన్నారు. చివరిలో సభ్యులంతా కలిసి గ్రూపు ఫొటో దిగడంతో కౌన్సిల్ సమావేశం ముగిసింది. సభ ప్రారంభంలో మేయర్ నూర్జహాన్ మాట్లాడుతూ గత ఐదేళ్లలో నగరంలో చేపట్టిన అభివృద్ధి పనులను వివరించారు. ఐదేళ్ల కాలంలో సహకరించిన సహచర కార్పొరేటర్లు, కో–ఆప్షన్ సభ్యులు, అధికారులు, సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు.
వైఎస్సార్‌సీపీ కార్యాలయానికి కరెంట్ కట్‌పై నిలదీత
నగరంలో నిర్మిస్తున్న వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయానికి విద్యుత్ కనెక్షన్ కట్ చేయించడంపై వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్ గుడిదేసి శ్రీనివాసరావు ప్రశ్నించారు. అధికార పార్టీ నాయకులు కక్షపూరితంగా తమ పార్టీ కార్యాలయానికి విద్యుత్ తొలగించారని దుయ్యబట్టారు. దీనిపై కమిషనర్ భానుప్రతాప్ సమాధానమిస్తూ జిల్లా కార్యాలయ నిర్మాణానికి ప్లాన్ అనుమతులు లేవని, దీంతో విద్యుత్ కనెక్షన్ కట్ చేయించామని అన్నారు. మేకల కబేళాలో పనిచేస్తున్న పశువైద్యాధికారి వెంకయ్య అంశంపై జరిగిన చర్చలో ఎస్‌ఎంఆర్ పెదబాబు ఘాటుగా స్పందించారు. ఆయన విధులు సక్రమంగా నిర్వహి ంచనప్పుడు కార్పొరేషన్ నుంచి వేతనం ఎందుకు చెల్లించాలని ప్రశ్నించారు. ఈ క్రమంలో వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్ గుడిదేశి శ్రీనివాసరావు కల్పించుకుని మాట్లాడబోగా పెదబాబు చేతిలోని మైక్‌ను విసిరివేశారు. మొత్తానికి చివరి సమావేశాన్ని మమ అనిపించేశారు.
వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్ గుడిదేశి, డిప్యూటీ మేయర్ కర్రి మధ్య వాదోపవాదాలు
మేయర్ నూర్జహాన్‌కు వినతిపత్రం అందిస్తున్న వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు
ఆఖరి సమావేశంలోనూ తప్పని వాదోపవాదాలు
సమస్యలపై నిలదీసిన వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు
ఏలూరులో అజెండాలోని 17 అంశాలకు ఆమోదం


