● బ్యాంకుల వద్ద మహిళలే లక్ష్యంగా మోసాలు
● సీసీ పుటేజీలో గుర్తించిన పోలీసులు
● నిందితుడిపై 50కు పైగా కేసులు
కై కలూరు: బ్యాంకులో అన్నీ తెలిసిన వ్యక్తిగా చలామణి అవుతాడు. అక్కడ వస్తువులు సర్దుతున్నట్టు నటిస్తూ బ్యాంకు సిబ్బందితో చనువుగా మాట్లాడతాడు. చదువురాని డ్వాక్రా మహిళలను టార్గెట్ చేస్తూ.. అదును చూసి ఫేక్ ఓచర్లు రాసి సొమ్ములు కాజేస్తున్నాడు తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరుకు చెందిన షేక్ నాగూర్ మీరావలీ అనే కేటుగాడు. ఇదే తరహాలో కృష్ణా, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో మీరావలిపై 50కు పైగా కేసులు నమోదయ్యాయి. బ్యాంకుల వద్దకు వచ్చిన డ్వాక్రా మహిళలు, వృద్ధులు, నిరక్షరాస్యులను లక్ష్యంగా చే సుకుని తాను బ్యాంకు ఉద్యోగి, డ్వాక్రా సీసీ అంటూ నమ్మించి నగదు తీసుకుని కౌంటర్‌లో చెల్లిస్తా నని నమ్మిస్తున్నాడు. అనంతరం వారికి ఫేక్ ఓచర్ అందించి సొమ్ములతో ఉడాయిస్తున్నాడు.
మోసం బట్టబయలయ్యిందిలా..
కలిదిండి మండలం గుర్వాయిపాలెంకు చెందిన బొల్లా ముత్యాలమ్మ జూన్ 6న కలిదిండి ఎస్‌బీఐ బ్యాంకుకు డ్వాక్రా రుణ వాయిదా చెల్లించేందుకు వెళ్లింది. అప్పటికే కొన్ని రోజులుగా డ్వాక్రా మహిళలకు తాను బ్యాంకు సిబ్బంది, వెలుగు కార్యాలయానికి చెందిన వ్యక్తిగా మీరావలి నమ్మిస్తూ వ చ్చాడు. దీంతో ఓచర్ రాసి నగదు కౌంటర్‌లో చెల్లిస్తానని చెప్పగా ముత్యాలమ్మ నమ్మింది. అతడికి రూ.61 వేలు ఇవ్వగా.. కౌంటర్ వద్దకు వెళ్లి నగదు చెల్లించకుండా అప్పటికే తన జేబులో సిద్ధం చేసుకున్న చెల్లింపు రశీదును ఆమె ఇచ్చి మోసం చేశాడు. ఆ రశీదు తీసుకుని ఆమె ఇంటికి వెళ్లిపోయింది. తా జాగా మరలా వాయిదా చెల్లించేందుకు ఆమె వెళ్లగా అసలు బండారం బయట పడింది. ఆమె కలిదిండి పోలీసులను ఆశ్రయించగా.. బ్యాంకులో సీసీ పుటేజీని పరిశీలించి మోసగాడు నాగూల్ మీరావలీని గుర్తించారు. అతడి ఆచూకీ తెలిసిన వారు పోలీసు సిబ్బందికి సమాచారం అందించాలని కోరారు. బ్యాంకుల వద్ద ఖాతాదారులు అప్రమత్తంగా ఉండాలని కలిదిండి ఎస్సై పవన్‌కుమార్ సూచించారు.


