పోషకాహారం ‘ఎగ్గొ’ట్టారు | - | Sakshi
Sakshi News home page

పోషకాహారం ‘ఎగ్గొ’ట్టారు

Jul 17 2026 1:10 AM | Updated on Jul 17 2026 1:10 AM

వచ్చే వారం నుంచి అందిస్తాం

ట్రిపుల్‌ఐటీ విద్యార్థులకు అందని కోడిగుడ్డు, చికెన్‌

నూజివీడు: రాష్ట్రంలోని రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్‌ఐటీల్లో విద్యార్థులకు 15 రోజులుగా కోడిగుడ్డు, చికెన్‌ అందడం లేదు. దీంతో విద్యార్థులు కూరలతో భోజనం చేస్తున్నారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతో ట్రిపుల్‌ఐటీలను ఏర్పాటు చేసిన నాటి నుంచి ఆహారంలో వారానికి రెండు రోజులు చికెన్‌, ఐదు రోజులు కోడిగుడ్డు పెడుతున్నారు. అయితే వేసవి సెలవుల అనంతరం ఈనెల 1 నుంచి రాష్ట్రంలోని నాలుగు ట్రిపుల్‌ఐటీ లు పునః ప్రారంభమయ్యాయి. వీటిల్లో 26,400 మంది విద్యార్థులు ఉన్నారు. వీరికి ఆహారంలో ఇప్పటివరకూ (గురువారం) కోడిగుడ్డు, చికెన్‌ పెట్టలేదు. దీనిపై అడిగితే వచ్చే వారం నుంచి పెడగామని ఫ్యాకల్టీలు చెబుతున్నారే తప్ప కచ్చితంగా సమాధానం ఇవ్వడం లేదు. చికెన్‌, కోడిగుడ్లు ఎ వరితో పెట్టించాలి, ఎవరికి బాధ్యతలు ఎలా అప్పగించాలనే అంశం సైతం కొలిక్కి రాలేదు. దీంతో మరిన్ని రోజులు చికెన్‌, కోడిగుడ్డు అందే పరిస్థితి కనిపించడం లేదు.

ఏకపక్షంగా ‘హరేకృష్ణ’కు..

ట్రిపుల్‌ఐటీలను ఏర్పాటు చేసిన నాటి నుంచి మెస్‌ల నిర్వహణను టెండర్ల ప్రక్రియ ద్వారా నిర్వాహకులను ఎంపిక చేసి వారికి అప్పగించేవారు. గతేడాది దసరా సెలవుల అనంతరం మెస్‌లను హరేకృష్ణ మూవ్‌మెంట్‌ చారిటబుల్‌ ఫౌండేషన్‌కు ఏకపక్షంగా అప్పగించారు. అయితే తాము కోడి గుడ్డు, చికెన్‌ పెట్టమంటూ ఫౌండేషన్‌ నిర్వాహకులు ఆర్జీయూకేటీ యాజమాన్యానికి స్పష్టంగా చెప్పారు. దీంతో అప్పట్లో ట్రిపుల్‌ఐటీలో ఉన్న హెల్పింగ్‌ హ్యాండ్స్‌ ద్వారా కోడిగుడ్డు, చికెన్‌ను విద్యార్థులకు పెట్టించారు. వేసవి సెలవుల వరకు హెల్పింగ్‌ హ్యాండ్స్‌ సభ్యులు వీటిని అందించగా.. ఈ విద్యా సంవత్సరంలో పెట్టలేమని తెలియజేశారు. దీంతో సమస్యను ఎలా పరిష్కరించాలో తెలియక ఆర్జీయూ కేటీ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. కోడిగుడ్డు, చికెన్‌ పెట్టనప్పుడు మెస్‌ల నిర్వహణను హరేకృష్ణ ఫౌండేషన్‌కు కాకుండా టెండర్‌ ద్వారా వేరొకరికి అప్పగిస్తే ఈ సమస్య ఉత్పన్నమయ్యేది కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఫౌండేషన్‌ నిర్వాహకులు చెప్పినట్టు ఆర్జీయూకేటీ అధికారులు వింటున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

వచ్చే వారం నుంచి ట్రిపుల్‌ఐటీల్లోని విద్యార్థులకు వారంలో ఒక రోజు చికెన్‌, నాలుగు రోజులు కోడిగుడ్డు పెడతాం. ఈనెల 17, 18వ తేదీల్లో దీనిపై నిర్ణయం తీసుకుంటాం. పూర్తిస్థాయిలో విద్యార్థులు రాలేదనే ఇన్ని రోజులుగా పెట్టలేదు.

– ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్‌, రిజిస్ట్రార్‌, ఆర్జీయూకేటీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement