ఏలూరు (టూటౌన్): ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లావ్యాప్తంగా ఈనెల 18న ప్రత్యేక లోక్‌అదాలత్ నిర్వహించనున్నామని, చెక్‌బౌన్స్ కేసులను రాజీ చేస్తామని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్‌పర్సన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.శ్రీదేవి తెలిపారు. ఏలూరులో గురువారం ఉమ్మడి జిల్లాలోని న్యాయమూర్తులతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. చెక్‌బౌన్స్ కేసుల్లో కక్షిదారులు నేరుగా లేదా న్యాయవాదుల ద్వారా సంప్రదించవచ్చన్నారు. కేసుల పరిష్కారంలో సందేహాలు ఉంటే 08812 224555 లేదా 15100 నంబర్‌లో సంప్రదించాలని కోరారు.
గణపవరం: పంచాయతీ పరిపాలనలో నాణ్యతా ప్రమాణాలను అందుకున్న గణపవరం పంచాయతీకి ప్రతిష్టాత్మక ఐఎస్‌ఓ సర్టిఫికెట్ లభించింది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఐఎస్‌ఓ గుర్తింపు పొందిన తొలి పంచాయతీగా గణపవరం రికార్డు నెలకొల్పింది. రాష్ట్రవ్యాప్తంగా 23 పంచాయతీలు ఐఎస్‌ఓ సర్టిఫికెట్ కోసం ఎంపిక కాగా గణపవరం రెండో స్థానం దక్కించుకుంది. ఇటీవల కేరళకి చెందిన ఐఎస్‌ఓ ఆడిట్ బృందం గ్రామంలో పర్యటించింది. బుధవారం విజయవాడలో పంచాయతీరాజ్ కమిషనర్ ఎం.కృష్ణతేజ చేతులమీదుగా గణపవరం పంచాయతీ కార్యదర్శి దార్ల శివరామ్‌ప్రసాద్ ఐఎస్‌ఓ సర్టిఫికెట్‌ను అందుకున్నారు. గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు, దాతలు, పంచాయతీ ఉద్యోగుల సమష్టి కృషితో ఈ గుర్తింపు లభించిందని శివరామ్‌ప్రసాద్ తెలిపారు. గణపవరం ఎంపీపీ అర్ధవరం రాము, జెడ్పీటీసీ సభ్యురాలు దేవారపు సోమలక్ష్మి, ఎంపీడీఓ సత్యనారాయణ, మాజీ సర్పంచ్ మూర అలంకారం, ఉప సర్పంచ్ దండు రాము తదితరులు అభినందనలు తెలిపారు.
బుట్టాయగూడెం: స్థానిక తహసీల్దార్ కార్యాలయం సమీపంలో ఉన్న మద్యం దుకాణాన్ని తొలగించాలని పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో వి ద్యార్థులు గురువారం ధర్నా చేపట్టారు. సంఘ నాయకుడు బన్నే వినోద్ మాట్లాడుతూ బ్రాందీ షాపును ప్రధాన రహదారి, ప్రభుత్వ కార్యాలయాల సమీపంలో ఏర్పాటు చేశారని, దీంతో విద్యార్థులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నా రన్నారు. వెంటనే తొలగించాలని డిమాండ్ చే శారు. తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా అ నంతరం తహసీల్దార్ ప్రమద్వరకు వినతిపత్రం అందజేశారు. విద్యార్థులు జి.తేజ, కె.జంపన్న, ఎం.విష్ణు, వి.చరణ్ తదితరులు పాల్గొన్నారు.
ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల చినవెంకన్నకు తణుకుకు చెందిన దాత వి.రవిజైన్ 118 గ్రాముల బంగారంతో చేయించిన హారాన్ని గురువారం సమర్పించారు. లక్ష్మీదేవి బొమ్మల నగిషీ డిజైన్‌లో ప్రత్యేకంగా తయారుచేసిన ఈ హారాన్ని దేవస్థానం ఏఈఓ మెట్టపల్లి దుర్గారావు, ఆలయ అర్చకులకు అందించారు. ఈ హారంలో 9 పచ్చ పూసలు, 104 తెలుపు రాళ్లు, 2 పెద్ద రాళ్లు, 2 ఎరుపు రాళ్లు, 27 ముత్యాలను పొదిగారు. దీని విలువ సుమారు రూ.19 లక్షలు ఉంటుందని దేవస్థానం అధికారులు అంచనా వేశారు. శ్రీవారి అలంకరణకు హారాన్ని వినియోగించాలని దాత రవిజైన్ కోరారు. ఆలయ అధికారులు దాతను అభినందించి, స్వామివారి ప్రత్యేక దర్శన సౌకర్యాన్ని కల్పించారు.


