కొయ్యలగూడెం: మండలంలోని యర్రంపేట గ్రీన్‌ఫీల్డ్ హైవే వద్ద బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పిప్పర గ్రామానికి చెందిన కుచ్చర్లపాటి దిలీప్ కుమార్ (32) లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. మంగళవారం సాయంత్రం లారీ లోడ్‌తో కొయ్యలగూడెం వెళ్లిన అతను, అక్కడ అన్‌లోడ్ చేసిన అనంతరం బుధవారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో రాజమండ్రి వైపు వస్తున్నాడు. ఈ క్రమంలో యర్రంపేట గ్రీన్‌ఫీల్డ్ హైవే వద్దకు వచ్చేసరికి, దిలీప్ కుమార్ నడుపుతున్న వాహనానికి ఎదురుగా వస్తున్న ఒక లారీని తప్పించబోయాడు. ఆ లారీని తప్పించే క్రమంలో ఇతని వాహనం అదుపుతప్పి పక్కకు దూసుకుపోవడంతో తీవ్ర గాయాలై దిలీప్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి ఇంకా వివాహం కాలేదు. దిలీప్‌కుమార్ తల్లి జంపన సుశీల ఫిర్యాదు మేరకు కొయ్యలగూడెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


