ఎక్స్‌ప్రెస్‌లు ఆపాలి
● భీమడోలులో ఆగని ఎక్స్‌ప్రెస్‌లు
● ద్వారకాతిరుమల భక్తులు,
ప్రయాణికుల పడిగాపులు
భీమడోలు: ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకాతిరుమలకు ప్రధాన కూడలిగా, సుమారు 50 గ్రామాలకు కేంద్రంగా ఉన్న భీమడోలు జంక్షన్‌లో ఎక్స్‌ప్రెస్ బస్సులు నిలవకపోవడంతో భక్తులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గుండు గొలను – కొవ్వూరు జాతీయ రహదారి విస్తరణ తర్వాత, దూరప్రాంతాలకు వెళ్లే ఎక్స్‌ప్రెస్ బస్సులన్నీ కొత్త హైవే మీదుగానే వెళ్లిపోతుండటమే ఈ సమస్యకు ప్రధాన కారణం.
ఎదురవుతున్న ఇబ్బందులు
గంటల కొద్దీ నిరీక్షణ: నిత్యం సుమారు 2,500 మంది ప్రయాణించే ఈ జంక్షన్‌లో ఎక్స్‌ప్రెస్ బస్సుల కోసం గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. భద్రతా లోపం: బస్టాండ్ ప్రాంగణంలోకి కేవలం పల్లె వెలుగు బస్సులు మాత్రమే వస్తున్నాయి. వచ్చే అరకొర ఎక్స్‌ప్రెస్ బస్సులు కూడా బయట రోడ్డుపైనే ఆగుతుండటంతో వాటిని అందుకోవడానికి వృద్ధులు, మహిళలు, పిల్లలు ఉరుకులు పరుగులు పెట్టాల్సి వస్తోంది. ఈ క్రమంలో ప్రమాదాలు జరిగి పలువురు గాయపడుతున్నారు.
ఆదాయంపై ప్రభావం
ద్వారకాతిరుమల దేవస్థాన అధికారులు గానీ, ఆర్టీసీ యాజమాన్యం గానీ బస్సుల నిలుపుదలకు తగిన శ్రద్ధ చూపడం లేదు. వాడపల్లి తరహాలో ద్వారకాతిరుమలకు ప్రత్యేక ఎక్స్‌ప్రెస్‌లు నడిపితే ఆర్టీసీకి భారీ ఆదాయం లభిస్తుందని భక్తులు సూచిస్తున్నారు. వీటి కోసం కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు ఆర్టీసీ అధికారులకు వినతిపత్రాలు ఇచ్చినా ఫలితం లేకుండా పోయింది. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి భీమడోలు జంక్షన్‌లో ఎక్స్‌ప్రెస్ బస్సులు ఆగేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
భీమడోలు జంక్షన్, భీమ డోలు రైల్వేగేటు వద్ద ఎక్స్ ప్రెస్ బస్సులను ఆపాలని ఎంపీ పుట్టా మహేష్‌కుమార్, ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజుకు గ్రామపెద్దలు వినతిపత్రాలు అందించారు. దూర ప్రాంతాల నుంచి ద్వారకాతిరుమలకు వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. శని, ఆదివారాలతో పాటు సెలవు రోజుల్లో భీమడోలు బస్టాండ్ కిక్కిరిసిపోతుంది. అధికారులు స్పందించి ఎక్స్‌ప్రెస్ బస్సులు ఆపేలా చర్యలు తీసుకోవాలి.
– ముప్పిరిశెట్టి సుబ్రహ్మణ్యం, గ్రామస్తుడు, భీమడోలు


