గణపవరం: సాగునీరు అందక నారుమడులు నెర్రలు తీసి, నారు ఎండిపోతున్న గ్రామాల్లో ఇరిగేషన్, వ్యవసాయ శాఖ అధికారులు హరికృష్ణ, ఆర్‌ఎస్‌ప్రసాద్, నీటి సంఘాల సభ్యులు ఆదివారం పర్యటించారు. ‘సమస్యల సుడిగుండంలో సాగు’ శీర్షికన శనివారం ‘సాక్షి’లో ప్ర చురించిన కథనానికి స్పందించారు. కొందేపాడు, ము ప్పర్తిపాడు, మొయ్యేరులో పంట కాలువలను పరిశీలించి తూడు, కర్రనాచు తొలగింపునకు చర్యలు చేపట్టారు. మండపాక చానల్ నుంచి వచ్చే మొయ్యేరు, కొమ్మర, పాలూరు కాలువల్లో అనధికార తూములు ఎక్కువగా ఉన్నాయని, వాటిని తొలగిస్తేనే తమకు సాగునీరు అందుతుందని రైతులు అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. తమ గ్రామాలు శివారున ఉండటంతో సాగునీరు పూర్తిగా అందడం లేదని, నీటిమట్టం పెంచాలని కోరారు. ఎలినినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితుల ఏర్పడటం, శివారు గ్రామాలు కావడంతో నీటి సమస్య తలెత్తిందని, తక్షణమే చర్యలు తీసుకుంటామని అధికారులు రైతులకు హామీ ఇచ్చారు. కాలువల్లో నీటిమట్టం పెంచుతామని, ఇంజన్లు ఏర్పాటు చేసి నీరందించే ఏర్పాట్లు చేస్తామన్నారు. ముందుగా పగుళ్లు తీసిన నారుమడులు, పూడుకుపోయిన పంట కాలువలను పరిశీలించారు. అనధికార తూముల తొలగింపునకు చర్యలు తీసుకుంటామని ఇరిగేషన్ ఏఈ హరికృష్ణ కొందేపాడు గ్రామ రైతులకు హామీ ఇచ్చారు.


